శ్రీరాములుతో వైయస్ జగన్ రహస్య మంతనాలు?

ప్రస్తుతం అనంతపురం జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటున్నారు. సోమవారం అనంతపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తర్వాత జగన్ నేరుగా బళ్లారికి చేరుకున్నట్లు చెబుతున్నారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం జగన్ బళ్ళారి శివార్లలోని రహస్య ప్రదేశంలో గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులు, అనుచరులతో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. గాలి ముఖ్యఅనుచరుడు, బిఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములుతో పాటు, గాలి సోదరులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారమంటూ ఆ పత్రిక రాసింది.
అక్రమాస్తుల కేసులో సిబిఐ జారీచేసిన సమన్లు, గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న ఓఎంసి కేసుల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కర్నాటకలో పాదయాత్ర నిర్వహిస్తున్న బిఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు హెలిక్యాప్టర్‌లో హుటాహుటిన బళ్ళారి చేరుకుని జగన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ మంతనాల్లో రాయచూరు ఎంపి పక్కీరప్ప, ఎమ్మెల్యేలు నాగేంద్ర, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. బళ్ళారి గ్రామీణ ఎమ్మెల్యే శ్రీరాములు తన అనుచరులతో కలిసి ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications