కార్యవర్గ సమావేశానికి డుమ్మా: పార్టీ వీడనని యెడ్డీ

పార్టీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో జరిగే బీజేపీ సమావేశాలకు హాజరు కానని యడ్డీ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కాలపరిమితి ముగిసేవరకూ కొనసాగాలన్నదే తన అభిమతమని అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా పార్టీ కేంద్ర నాయకత్వం తనను నియమించకపోవడం నిరాశ కలిగించిందని యడ్యూరప్ప చెప్పారు.
ఈ నెల 23వ తేదీన ముంబైలో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశానకి తాను హాజరు కాబోనని చెప్పారు. ఈ కార్యవర్గ సమావేశానికి ఎల్‌కె అద్వానీతో పాటు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ వంటి జాతీయ నాయకులు హాజరవుతున్నారు. యడ్యూరప్ప మరో పార్టీలో చేరుతారనే అభిప్రాయాన్ని కలిగించవద్దని ఆయన మీడియాతో అన్నారు.
యడ్యూరప్ప శుక్రవారం కొత్త కార్యాలయాన్ని తెరిచారు. దీంతో ఆయన బిజెపిని వీడి, కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు చెలరేగాయి. కర్ణాటక జనతా పార్టీ అని ఆయన తన కొత్త పార్టీకి నామకరణం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అక్రమ మైనింగ్ కుంభకోణంలో యడ్యూరప్ప పాత్రపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆయన, ఆయన కుమారులు, అల్లుడి ఇళ్లపై సిబిఐ దాడులు జరిగాయి. దీంతో యడ్యూరప్ప చిక్కుల్లో పడ్డారు.












Click it and Unblock the Notifications