మీడియా వార్తలపై గుర్రుమన్న మంత్రి మోపిదేవి

తన అరెస్టే తరువాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవన్నీ అసత్య కథనాలని ఆయన అన్నారు. తనకు సిబిఐ నుంచి ఏ విధమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. మీడియాలో దీనిపై వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. సిబిఐ ముందు తాను ఇది వరకు ఓసారి హాజరయ్యారని, పిలిస్తే మళ్లీ వెళ్తానని ఆయన చెప్పారు.
వాన్‌పిక్ వ్యవహారంలో తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. దీనిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. సిబిఐకి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. వాన్‌పిక్ వ్యవహారంలో మోపిదేవి వెంకటరమణ నేడో రేపో సిబిఐ చేత అరెస్టవుతారంటూ సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
మోపిదేవి వెంకటరమణ సోమవారం సిబిఐ ముందు హాజరవుతారని, ఆయనను సిబిఐ ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని సోమవారం వార్తలు వచ్చాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌కు ఆమోదం ఇవ్వడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక, న్యాయ శాఖల సలహాలను కూడా ఆయన బేఖాతరు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications