చంద్రబాబు నోట ఫిక్సింగ్ మాట, జగన్‌కు అండగా కాంగ్రెస్

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, కాంగ్రెసు పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పేరులో కూడా మార్పు లేదని, దొందు దొందే అన్నారు.

ఆ రెండు పార్టీలు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితిని సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు జగన్, కాంగ్రెసు కలిసి కుట్ర చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిరంజీవిని తమలో కలుపుకున్న కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితితోనూ కలిసి వెళుతూ టిడిపిని లేకుండా చేయాలని చూస్తోందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరు కలిసి రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకున్నారన్నారు. దోచుకున్న వైయస్ పైన కాంగ్రెసు నేతలు ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ జగన్‌ను, అవినీతి మంత్రులను ఎవరినైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి దృతరాష్ట్రుడిలా వ్యవహరించారన్నారు. జగన్ అరెస్టునే కాదు అవినీతిపరులందరి పైనా చర్యలు తీసుకోవాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అన్నారు. మంత్రులను కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఎలాంటి అవినీతి చేయకపోతే సిబిఐ క్లీన్ చిట్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

ఈ రాష్ట్రంలో ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు జగన్ చేశారన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ కాంగ్రెసు పార్టీని వీడారన్నారు. జగన్ ఆస్తుల కేసులో అయినా, మరే విషయంలో అయినా కాంగ్రెసు పార్టీయే అసలు దోషి అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు నీరుగారిపోయే విధంగా కాంగ్రెసు ముందుకు వెళుతోందన్నారు. అసలు దోషులను వదిలి అధికారులను బలి చేస్తున్నారని విమర్శించారు.

ఇటీవల జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెసు సహకరించిందని ఆరోపించారు. దివంగత వైయస్ విగ్రహాల ఏర్పాటు మొదలుకొని అన్ని విషయాల్లో కాంగ్రెసు జగన్‌కు అండగా నిలబడుతోందన్నారు. తాను వాయలార్ రవితో భేటీ అయ్యానని జగన్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు. వైయస్ ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ప్రజలు వైయస్సార్ కాంగ్రెసును, కాంగ్రెసును వేరుగా చూడటం లేదన్నారు. తప్పు చేయకపోతే ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు జగన్ చెప్పాలన్నారు. 2జి, మధుకొడా, యడ్డీ కేసులోలో విచారణ జరిగినట్లు జగన్ కేసులో జరగడం లేదన్నారు. ప్రధానిని కలిసిన తర్వాతే జగన్ తన ఆస్తులపై కేసు వేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+