చంచల్‌గుడా జైల్లో పదో విఐపి ఖైదీ వైయస్ జగన్

జగన్‌ను 6093 నెంబర్ ఖైదీగా గుర్తించారు. జగన్‌ను భారీ భద్రత మధ్య సోమవారం సాయంత్రం చంచల్‌గుడా జైలుకు తరలించారు. ఆయనకు కోర్టు వచ్చే నెల 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తనను ప్రత్యేక కెటగిరీ ఖైదీగా గుర్తించాలని జగన్ చేసిన విజ్ఞప్తికి కోర్టు సానుకూలంగా ప్రతిస్పందించింది. ఆయన ఓ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాకుండా పార్లమెంటు సభ్యుడు కూడా. దీంతో ఆయనను ప్రత్యేక హోదా గల ఖైదీగా కోర్టు గుర్తించింది. చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని గుర్తించారు.
వైయస్ జగన్‌ను చూడడానికి ఆయన సతీమణి భారతీ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్, జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయి రెడ్డి చంచల్‌గుడా జైలుకు వచ్చారు. అయితే, నిబంధనల ప్రకారం జగన్‌ను చూడానికి అనుమతించడం కుదరదని జైలు అధికారులు చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో బెయిల్ లభించడంతో రెండో నిందితుడు విజయసాయి రెడ్డి బయట ఉన్నారు. ఒఎంసి అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కూడా బెయిల్ లభించింది. అయితే, ఎఎంసి అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూర్ జైలులో ఉన్నారు.
ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్ రెడ్డి చంచల్‌గుడా జైలులోనే ఉన్నారు. ఆయన వైయస్ జగన్‌కు బంధువు కూడా. భార్య భారతీరెడ్డి తరఫున ఆయన జగన్‌కు బంధువు అవుతారు. చంచల్‌గుడా జైలులో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మారెడ్డి ఉన్నారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో నిందితుడు బిపి ఆచార్య, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications