నాపసుపు కుంకుమలు తీశాడు:జగన్‌పై పరిటాల సునీత

చెప్పినట్లుగానే పరిటాల రవిని పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను అసెంబ్లీలో వైయస్ ఎదుట ఇదే విషయాన్ని ప్రస్తావించానని, ఈ రోజు కూడా అదే చెబుతున్నానని ఆమె అన్నారు. పరిటాల రవి హత్యకు జగన్ మూలకారకుడని సునీత ఆరోపించారు. సూట్‌కేస్ బాంబు కేసులో కూడా జగనే తొలి ముద్దాయి అని చెప్పారు. అధికారబలంతో ఆ రోజు కేసు నుంచి తప్పించుకున్నారని, రవి హత్య కేసుతో జగన్‌కు సంబంధం లేదని సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని వైయస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ చెప్పుకుంటూ వచ్చారన్నారు. ఇది విన్న విజయలక్ష్మి ఆనాడు సీబీఐని కొనియాడారన్నారు.
నేడు అవినీతి కేసులో జగన్ జైలుకు వెళితే తన కొడుక్కి ఏమీ తెలియదని, అమాయకుడని మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. సానుభూతి కోసమే విజయమ్మ ఈ డ్రామా ఆడుతున్నారని సునీత అన్నారు. ఏ కన్నతల్లి అయినా బయటి నుంచి తన కొడుకు ఏదైనా తీసుకొస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతుందని, అయితే జగన్‌కు లక్షల కోట్లు వస్తున్నా అనేక కంపెనీలు స్థాపిస్తున్నా విజయలక్ష్మి మాత్రం ఇవన్నీ ఎలా వస్తున్నాయో ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. తన భర్త హత్య కేసులో ఆరోజే సీబీఐ సమగ్ర విచారణ జరిపించి ఉంటే జగన్‌కు తప్పకుండా శిక్ష పడేదని సునీత అభిప్రాయపడ్డారు.
ఆ రోజు అధికారబలంతో తప్పించుకున్నా, ఈరోజు దేవుడున్నాడు కాబట్టే జగన్ జైలు పాలయ్యారన్నారు. తన భర్త హత్యకు దంతలూరి కృష్ణ ద్వారా తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపారనేందుకు తమ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు తాము వాటిని చూపినా నమ్మే పరిస్థితి లేదని, అందుకే రవి హత్య కేసును సీబీఐ పునర్విచారణ చేయాలని కోరుతూ అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళవారం ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరుతున్నామన్నారు. వారు అనుమతిస్తే మంగళవారం దీక్ష చేస్తానని సునీత తెలిపారు.












Click it and Unblock the Notifications