చిరంజీవికేం తెలుసు: షర్మిల, నోరుందని..: విజయమ్మ

గత రెండేళ్లుగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారని, కేంద్రం కనుసన్నల్లో సిబిఐ పని చేస్తోందని ఆమె విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఏం తెలుసునని ఆమె అడిగారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.
మద్యం షాపుల గురించి ముందు బొత్స సత్యనారాయణ చెప్తే సంతోషిస్తామని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి మాటలు వింటుంటే అధికార దాహం ఎవరికి ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. తన కూతురు ఇంట్లో దొరికిన డబ్బు గురించి మాట్లాడని చిరంజీవి తనమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు.
నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని విజయమ్మ హెచ్చరించారు. కొంత మంది వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తామే చంపుకున్నామని, తమపై అనుమానాలున్నాయని కాంగ్రెసు నేతలు మాట్లాడడం దుర్మార్గమని ఆమె అన్నారు. అందరు కలిసి జగన్‌కు బెయిల్ ఇవ్వకుండా చూస్తున్నారని ఆమె విమర్శించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆమె అన్నారు. విధిలేని పరిస్థితిలోనే న్యాయం కోసం తాను ఇలా బయటకు వచ్చానని, అంతే తప్ప తనకు అధికార దాహం లేదని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేవారట, ఆ పార్టీలో ఉంటే జగన్ నిర్దోషి అయ్యేవాడట అని అని ఆమె అన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తే నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు.
చివరకు తన సూట్‌కేసులు కూడా తనిఖీ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనమేమైనా పాకిస్తాన్‌లో ఉన్నామా అని ఆమె అడిగారు. ప్రజలే న్యాయనిర్ణేతలని, వారే తీర్పు ఇవ్వాలని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కూడా జైల్లో పెట్టిస్తానని అంటున్నారని ఆణె అన్నారు.
చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాజన్నకు ఓటు వేసినట్లేనని ఆమె అన్నారు. వైయస్సార్ జీవించి ఉంటే సోమశిల ప్రాజెక్టు, రాళ్లపాడు రిజర్యాయర్లను అనుసంధాను చేసేవారని ఆమె అన్నారు. రూ. 1300 కోట్ల బకాయిలను రద్దు చేసిన రైతు పక్షపాతి వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆమె అన్నారు. వైయస్ హయాంలో ఎన్నడూ పన్నులు, చార్జీలని ప్రజలపై మోపలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications