లాగోస్‌లో భవనంపై కూలిన విమానం: 153 మంది మృతి

స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 3:44 గంటలు! 147 నుంచి 150 మంది ప్రయాణికులతో బయల్దేరిన దానా ఎయిర్ సంస్థకు చెందిన వాణిజ్య విమానం.. లాగోస్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. ఉత్తర దిశగా కొద్దిదూరం ఎగిరింది. టేకాఫ్ సమయంలో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్.. కంట్రోల్ టవర్‌ను సంప్రదించారు. అంతలోనే.. విమానం అదుపు తప్పింది. రెండంతస్థుల నివాస భవనంపై కుప్పకూలిపోయింది.
ఆకాశం నుంచి దూసుకొస్తున్న విమానాన్ని చూసి భీతావహులైన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కూలిన ధాటికి విమానం రెండు ముక్కలైంది. ట్యాంకులో ఉన్న ఇంధనం అంటుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. నల్లటి పొగ కమ్మేసింది. ప్లైట్‌లో ఉన్న వారందరూ మృతి చెందారని అధికారులు తెలిపారు.
వీరితో పాటు కూలిన ప్రాంతంలో నివసించే వారు ఇంకెవరైనా మరణించారో, తీవ్రగాయాల పాలయ్యారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మూడు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే యత్నాలు చేశాయి. సహాయం కోసం రెడ్ క్రాస్ నైజీరియా విభాగం రంగంలోకి దిగింది.












Click it and Unblock the Notifications