జగన్ ఆస్తుల కేసు: కిరణ్ మంత్రివర్గంలోకి జెసి దివాకర్?

అంతకుముందే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డిలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద 26 జివోలను వీరు జారీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ వారిని కూడా విచారిస్తోంది.
ఇప్పటికే సిబిఐ పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణలను విచారించింది. మిగిలిన వారిని త్వరలో విచారించే అవకాశముంది. మోపిదేవిని మూడు రోజుల పాటు విచారించిన సిబిఐ గత నెలలో అరెస్టు చేసింది. ఇప్పుడు ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కేసుతో సంబంధమున్న మిగిలిన మంత్రులు కూడా ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చనే ఊహాగానాలు వినిపించాయి.
ఇటీవల సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యను అరెస్టు చేయవచ్చుననే ప్రచారం జోరుగా జరిగింది. మిగిలిన వారిలో ఎవరినైనా అరెస్టు చేసిన పక్షంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముంది. అరెస్టు కాకపోయినా ఇప్పటికే మోపిదేవి జైలులో ఉండటం తదితర కారణాల వల్ల కిరణ్ పలువురిని తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఇస్తారనే వాదన వినిపిస్తోంది.
2004లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి... జెసిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైయస్ ఆయనకు మొండిచేయి చూపారు. అనంతరం ఆయన దుర్మరణం తర్వాత చాలారోజులు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. గత సంవత్సరం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలు అడ్డుకోవడంతో జెసిని కిరణ్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదనే వాదనలు ఉన్నాయి.
ఆ తర్వాత నుండి ఆయన కాస్త అలకబూనారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం ముఖ్యనేతలపై అసంతృప్తితోనే ఉన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆయన తన అసంతృప్తిని చెప్పకనే చెప్పారు. జిల్లా ప్రచారం కమిటీలోకి తాను అవసరం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత ఇటీవల ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధిష్టానం నుండి, ముఖ్యమంత్రి కిరణ్ నుండి మంత్రి పదవిపై హామీ వచ్చినందు వల్లే ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications