చిరంజీవి వ్యాఖ్యలపై బొత్స సత్తిబాబు నో కామెంట్

ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పట్ల ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతి ఒక్కటే కారణం కాదని, పెట్రోల్ ధర పెంపు వంటి అంశాలు కూడా కారణమని ఆయన అన్నారు. చిరంజీవిని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదించే తిరుపతి అభ్యర్థి ఎంపిక చేశామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో కలిసికట్టుగానే పనిచేశామని ఆయన చెప్పారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేటలో దళితులపై జరిగిన దాడితో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకరిద్దరు శాసనసభ్యులు పార్టీని వీడినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదని ఆయన అన్నారు.
చిరంజీవి వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తాను వివరణ ఇవ్వలేనని, చిరంజీవి పార్టీ వేదికలో ప్రస్తావిస్తే చర్చిస్తామని ఆయన చెప్పారు. ఒకటి రెండు స్థానాల్లో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి, అభ్యర్థుల ఎంపికపై నిరసనలు వ్యక్తమయ్యాయి తప్ప అన్ని స్థానాల్లో కలిసికట్టుగానే పనిచేశామని ఆయన చెప్పారు. సోనియా గాంధీతో ఏం చర్చించానే విషయాలను బయటకు చెప్పలేనని ఆయన అన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలో జరుగుతుందని ఆయన చెప్పారు.
కాగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శనివారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సోనియాను, ఇతర హైకమాండ్ పెద్దలను కలిసి ఉప ఎన్నికల ఫలితాలపై వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications