బాబువైపు దూసుకెళ్లిన లగడపాటి, గబ్బర్‌సింగ్‌లా కెవ్వు

దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ కావాలని బాబు ధర్నా చేయడాన్ని తప్పు పట్టిన లగడపాటి, ఆయనకు ఫ్లై ఓవర్ ఎందుకు వద్దో కలిసి వివరిస్తానని చెప్పారు. బాబును కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. మొదట బాబును శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కలవాలని అక్కడ పోటీ ధర్నాకు దిగారు. అయితే పోలీసులు బాబు కాన్వాయ్‌ని మళ్లించారు. దీంతో బాబు వేరే మార్గం గుండా కుమ్మరిపాలెం చేరుకున్నారు.
అప్పటికే లగడపాటి ఉన్న ప్రాంతానికి భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు. బాబును కలవనిచ్చేది లేదని చెప్పారు. అయితే పోలీసులు టిడిపి కార్యకర్తలను అక్కడ నుండి పంపించారు. ఆ తర్వాత బాబు కుమ్మరిపాలెం చేరుకున్న విషయం తెలిసిన లగడపాటి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి మహాధర్నా స్థలానికి బయలుదేరారు. పరిస్థితులు చేజారకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా అశోక స్థంభం సెంటర్ వద్ద లగడపాటిని అడ్డుకున్నారు.
లగడపాటి పోలీసులు కన్నుగప్పి 108 వాహనంలో కుమ్మరిపాలెం వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి లగడపాటి, మరికొందరు కాంగ్రెసు నేతలు కుమ్మరిపాలెం చేరుకొని మహాధర్నా వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని మరోసారి టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి లగడపాటిని దుర్గ గుడి దగ్గర అడ్డుకొన్నారు. అయితే కనీసం ముగ్గురినైనా కలిసేందుకు అనుమతించాలని పోలీసులను లగడపాటి కోరారు. కాని వారు ససేమీరా అన్నారు.
కాగా సూర్యాస్తమయంలోగా చంద్రబాబును కలుస్తానని చెప్పిన లగడపాటి.. విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లిన అన్ని ఫ్లైట్ టిక్కెట్లు కొన్నట్లుగా తెలుస్తోంది. బాబు ఎక్కే ఫ్లైట్ ఎక్కి జర్నీలోనైనా ఆయనకు ఫ్లై ఓవర్ ఎందుకు వద్దంటున్నానో వివరణ ఇస్తానని చెప్పారు. ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబును కలుస్తానని చెప్పారు. బాబును కలిసి గబ్బర్ సింగ్‌లా కెవ్వు కేక పెట్టిస్తానని సినిమా డైలాగ్ కొట్టారు. అభివృద్ధిపై వివరణ ఇస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications