రాజీనామా ఆలోచనే లేదు: సిఎంతో పార్థసారథి భేటీ

ఏం చేయాలనే విషయంపై న్యాయనిపుణులతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. అన్ని వివరాలు ముఖ్యమంత్రికి చెప్పానని, అలా చెప్పడం తన బాధ్యత అని ఆయన అన్నారు. డబ్బుల బదిలీ నియమనిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ పార్థసారథిని సమర్థించారు. వివరాలు సరిగా అందించకపోవడం వల్ల కోర్టు నుంచి అలాంటి నిర్ణయం వెలువడిందని లగడపాటి రాజగోపాల్ అన్నారు. హవాలాకు అవకాశమే లేదని ఆయన అన్నారు. వివరాలు అందించడంలో నిర్లక్ష్యం చేశారని, అందువల్లనే కోర్టు తీర్పు అలా వచ్చిందని ఆయన అన్నారు.
గతంలో తన కంపెనీ మిషనరీ కొనుగోలు విషయంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పార్థసారథిపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మంత్రి ఆర్థిక నేరాల కోర్టులో హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు మంత్రి నేరం చేసినట్లుగా బుధవారం నిర్ధారించింది. కోర్టు ఆయనకు రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది. మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది. అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో పార్థసారథి చేత రాజీనామా చేయించకపోవడంపై, ఈ విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పార్థసారథి సమావేశమయ్యారు. ఆయన లగడపాటితో కలిసి గంటకుపైగా ముఖ్యమంత్రితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని పార్థసారథి అన్నారు. కాగా, పార్థసారథి వ్యవహారంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ స్పందించారు. తాను ఉదయం నుంచి కార్యాలయంలో తీరిక లేకుండా ఉన్నానని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏమైనా చెప్తానని ఆయన గురువారం ఢిల్లీలో అన్నారు.












Click it and Unblock the Notifications