బస్సులోనే ముగ్గురి గొంతు కోశాడు: సైకో సాంబ పనేనా?

భద్రాచలం నుండి చెన్నై వెళుతున్న ఆర్టీసి బస్సు (నెంబర్ ఎపి 29 జడ్ 1543) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ - తడంబాక మధ్యకు చేరుకున్నాక ప్రయాణీకులు హాహాకారాలు చేశారని తెలుస్తోంది. ఏమైందో చూసే లోగా దుండగుడు పారిపోయాడని సమాచారం. తోటి ప్రయాణీకులు చూడగా నలుగురు కుత్తుకలు కోసి ఉన్నాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ముందుకు వెళితే ఆసుపత్రి లేదని తెలుసుకున్న బస్సు డ్రైవర్ వెంటనే బస్సును వెనక్కి తిప్పారు. సూళ్లూరుపేట ఆసుపత్రిలో వారిని చేర్పించారు. అందులో ముగ్గురు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మరొకరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పోలీసులు హంతకుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి చంపింది ఉన్మాది కావొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవలి వరకు నాలుగైదు జిల్లాలను వణికించిన సైకో సాంబశివ రావు పని కూడా కావొచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసుల నుండి తప్పించుకున్న సైకో సాంబ ఖమ్మం జిల్లాల్లో కనిపించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడే బస్సు ఎక్కి ఉంటాడని, ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు.
అయితే సాంబకు హత్య చేసే లక్షణం లేదని పోలీసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తిరుగుతున్నాడని అనుమానిస్తున్న కేరళ నర హంతకుడు ఆంటోనీ కూడా ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం అందించాలని అధికారులను, దర్యాఫ్తు చేపట్టాలని డిజిపిని ఆదేశించారు.












Click it and Unblock the Notifications