షిండే 'మహా' చేతివాటం: రాష్ట్రంలో గ్యాస్ చిచ్చు

చాలా కాలంగా విద్యుచ్ఛక్తి మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలోని రత్నగిరి పవర్ ప్లాంటుకు మేలు చేసే చర్యలు మొదలుపెట్టారు. విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ ప్లాంటుకు రసాయన ఎరువుల ప్లాంట్లకు ఇచ్చే 'తొలి ప్రాధాన్యం' ఇవ్వాలంటూ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 2008లోనే కేంద్ర మంత్రుల సాధికారిక కమిటీ రత్నగిరికి ఈ గుర్తింపు ఇవ్వాలంటూ అభిప్రాయపడింది.
అయితే, దీనిపై నిర్ణయం మాత్రం ఆగిపోయింది. 4 నెలల క్రితం షిండే ఈ విషయాన్ని మళ్లీ కదిలించారని వార్తలు వచ్చాయి. ఇది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్‌కు, పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి దినేశ్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ హీరాలాల్ సమారియా ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులతో మాట్లాడారు.
"కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిలో 2008 నాటి పరిస్థితులకు, ఇప్పటికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తాజా పరిస్థితులను గుర్తించి.. రత్నగిరికి 'తొలి ప్రాధాన్య' నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. విద్యుత్ శాఖ సిఫారసును మళ్లీ మంత్రుల కమిటీలో చర్చించండ''ని కోరారు. రాష్ట్ర విజ్ఞప్తికి పెట్రోలియం శాఖ తొలుత సరే అంది. ఆ తర్వాత చడీ చప్పు డు కాకుండా రత్నగిరి గుర్తింపును మార్చేస్తూ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో గ్యాస్ సరఫరాకు సంబంధించి మిగిలినవన్నీ ఒక ఎత్తు, రత్నగిరి ఒక్కటీ ఒక ఎత్తుగా మారింది. ఇతర విద్యుదుత్పత్తి కేంద్రాల కన్నా రత్నగిరికే ఎక్కువ గ్యాస్ సరఫరా అవుతుంది. దీనితో రాష్ట్ర కోటా 3.8 ఎంఎంఎస్‌సీఎండి నుంచి ఏకంగా 1.48 ఎంఎంఎస్‌సీఎండీకి తగ్గిపోయింది. ఫలితంగా 400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగనుంది.
రిలయన్స్ సంస్థ గ్యాస్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించివేయడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేటాయించిన దానిలో 38 శాతం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. ఎన్టీపీసీకి గ్యాస్‌ను మళ్లించడంతో.. ఇది 33 శాతానికి పడిపోయింది. రత్నగిరి దెబ్బకు ఇది 30 శాతం లోపునకు తగ్గిపోయింది. ఇంత తక్కువ ఇంధనంతో సాంకేతికంగా గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేయవు.
బలవంతంగా నడిపితే, విద్యుదుత్పత్తి కేంద్రాలు కుప్పకూలిపోయి అసలుకే మోసం వస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నాలుగు స్వతంత్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు విద్యుదుత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉందని తెలిసింది. అవి వినియోగించే గ్యాస్‌ను ఇతర గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు మళ్లిస్తే కనీసం అవైనా 80 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. ఈ రొటేషన్ పద్ధతికి అనుమతించాలని ఇప్పటికే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖను ట్రాన్స్‌కో కోరింది.
గ్యాస్ తరలింపుతో విద్యుత్ కొరతా: గంటా
రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు సరఫరా చేసే గ్యాస్‌తో రాష్ట్రానికి 400-500 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఓడరేవులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే వాతావరణం సహకరించక రాష్ట్రం భారీ విద్యుత్ కొరతను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ తరలింపు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 3.56 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌లో ప్రస్తుతం 1.36 ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే అందుతోందని, మిగతా గ్యాస్‌ను కూడా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కాగా, వరంగల్‌లో విమానాశ్రయం కోసం 1,400 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటికే 748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి గంటా తెలిపారు. ఆగస్టు చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో మిగతా భూమిని సేకరిస్తామని అన్నారు.
మహారాష్ట్రకు ఎలా కేటాయిస్తారు: దేవేందర్
కెజి బేసిన్‌కు చెందిన గ్యాస్‌ను మహారాష్ట్రకు ఎలా కేటాయిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల చేతకానితనం వల్లనే గ్యాస్ తరలిపోయిందని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలో విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్న వైనం కనిపించడం లేదా అని ఆయన అడిగారు.
మహారాష్ట్రకు గ్యాస్ కేటాయించడానికి మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. ఎనిమిదేళ్ల కాంగ్రెసు పాలనలో మన రాష్ట్రానికి పార్లమెంటు సభ్యులు ఒక్క ప్రాజెక్టునైనా సాధించి పెట్టారా అని ఆయన అడిగారు. రాష్ట్రంలో విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి ఉందని ఆయన అన్నారు.
400 మెగావాట్ల విద్యుత్తును రత్నగిరి ప్రాజెక్టుకు ఏ విధంగా అప్పజెప్పారో అప్పజెప్పారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు విజయవాడలో శనివారం ప్రశ్నించారు.