బాబుకు బైరెడ్డి తలనొప్పి: బాగుందనుకుంటుండగా షాక్

కొన్నాళ్లుగా టిడిపి కుటుంబ విభేదాలు, తెలంగాణ సమస్య.. ఇలా పలు రకాలుగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణను బుజ్జగించడం, బాలకృష్ణతో మాట్లాడటం వంటి కారణాలతో కుటుంబంలో సంక్షోభం దాదాపు ముగిసిపోయిందని భావిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడేందుకు బాబు సిద్ధమయ్యారట. మరోవైపు తెలంగాణ ఉద్యమంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ పరకాల ఎన్నికలలో మూడో స్థానం రావడంతో కొంత కొత్త ఉత్సాహం వచ్చింది.
తెలంగాణలో జగన్ పార్టీ అడుగిడటం, తెరాసకు బిజెపి తెలంగాణవాదం విషయంలో గట్టి ప్రత్యామ్నాయంగా ఉండటం, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పొంతన లేని మాటలు మాట్లాడుతుండటం, బిసి డిక్లరేషన్ తర్వాత బిసి వర్గాలు పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు తెలుపుతుండటం వంటి వివిధ కారణాల వల్ల పార్టీలో మళ్లీ పునరుత్తేజం కనిపిస్తోంది. త్వరలోనే పార్టీకి పునర్వైభవం వస్తుందని టిడిపి నేతలు భావిస్తున్నారు.
అదే సమయంలో ప్రజల్లో మరింత విశ్వాసం టిడిపి పట్ల కలుగజేసేందుకు బాబు తెలంగాణ, ఎస్సీ రిజర్వేషన్ పైన త్వరలో ఓ స్పష్టత ఇచ్చేందుకు సిద్దపడ్డారు. ఇలాంటి సమయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాబుకు తలనొప్పి తీసుకు వచ్చారు. బైరెడ్డి దీక్షను సమర్థిస్తే ఓ బాధ, విమర్శిస్తే మరో బాధ, అలా అని ఊరుకుంటే ఇంకో బాధ బాబును చుట్టుముడుతోంది. దీంతో ఏం చేయాలో బాబుకు అర్థం కావడం లేదని చెబుతున్నారు.
ఇప్పటికే బైరెడ్డి దీక్ష వెనుక చంద్రబాబు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణపై స్పష్టత ఇస్తానని చెబుతూనే బైరెడ్డిని క్లారిటీ ఇవ్వకుండా ఉండేందుకు రంగంలోకి దింపారనే విమర్శలు వస్తున్నాయి. తన దీక్ష వెనుక బాబు ప్రమేయం లేదని బైరెడ్డి చెప్పినప్పటికీ విమర్శలు మాత్రం తగ్గడం లేదు. ఒకవేళ బైరెడ్డి దీక్షపై విమర్శిస్తే సీమ నేతల నుండి, అనుకూలంగా మాట్లాడితే తెలంగాణ నేతల నుండి, ప్రజల నుండి బాబు ఘాటు స్పందన చవి చూస్తారు. బైరెడ్డి దీక్షపై బాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications