• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైపాల్ రెడ్డి వర్సెస్ కిరణ్ రెడ్డి: రెండుగా చీలిన కాంగ్రెసు

By Pratap
|

Kiran Kumar Reddy - Jaipal Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చెలరేగిన వివాదం ప్రత్యక్ష యుద్ధంగా మారింది. దీంతో కాంగ్రెసు రెండు చీలిపోయి పరస్పరం దూషించుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. ఒక వర్గం జైపాల్ రెడ్డిని వెనకేసుకొస్తుంటే, మరో వర్గం కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జైపాల్ రెడ్డిపై విరుచుకుపడుతోంది. రాష్ట్రానికి గ్యాస్ మంజూరు విషయంలో రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, కె.యాదవ్‌రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా జైపాల్ రెడ్డిని తప్పుపట్టలేమని చెబుతూ వస్తున్నారు.

మంత్రుల సాధికార కమిటీ నిర్ణయం మేరకే గ్యాస్ మంజూరవుతుందని, కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర వాటా పెరిగేలా చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్రానికి 11 నెలలపాటు గ్యాస్ సరఫరా తన చలవేనని జైపాల్ రెడ్డి ప్రకటించడం.. దానికి భిన్నంగా, మంత్రుల సాధికార కమిటీకి లేఖలు రాశామంటూ రాష్ట్ర ప్రభుత్వం లీకులివ్వడం రాజకీయంగా కుదుపునకు గురి చేసింది.

అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముమ్మరమైంది. సీఎల్పీ వేదికగానే జైపాల్ రెడ్డి వర్గం, కిరణ్ కుమార్ రెడ్డి వర్గం రెండుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగాయి. జైపాల్ రెడ్డికి మద్దతుగా శనివారం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆమోస్, యాదవ రెడ్డి మాట్లాడితే, ముఖ్యమంత్రి తరఫున ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, పొంగులేటి సుధాకర రెడ్డి ఎదురు దాడికి దిగారు. దానికి కొనసాగింపుగా, సీఎల్పీ వేదికగా ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి జైపాల్, సీనియర్ నేత కేశవరావులపై మండిపడ్డారు. పార్టీ నుంచి కేశవరావును బహిష్కరించాలని డిమాండ్ చేయడంతోపాటు 2004 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అసలు జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడానికే అనర్హుడని ధ్వజమెత్తారు.

కాగా, జగ్గారెడ్డి విమర్శలకు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దీటుగా బదులిచ్చారు. కేశవరావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసునని, ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడడం ఏమిటని నిలదీశారు. జగ్గారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనని ఘాటుగానే వ్యాఖ్యానించారు. అయితే, ఈనెల ఆరో తేదీన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

అప్పటి నుంచే ఒక్కసారిగా ఆయన దూకుడును పెంచారని అంటున్నారు. అయితే, గత మూడు రోజులుగా కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రికి మధ్య సమరం జరుగుతున్నా, కిరణ్ పక్షాన నిలబడి ఏ మంత్రి మాట్లాడకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటన సమయంలో అధిష్ఠానం నుంచి ముఖ్యమంత్రికి ఎలాంటి సంకేతాలైనా రావచ్చునని, కానీ, కేంద్ర మంత్రితో ఢీకొనేలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంత కాలం జైపాల్ రెడ్డితో కిరణ్‌కు భేదాభిప్రాయాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందేనని, కానీ, ఇప్పుడది బహిరంగ రహస్యమైందని ఆ మంత్రి తెలిపారు. ఇంత జరుగుతున్నా జైపాల్ రెడ్డి ఎక్కడా పెదవి విప్పడం లేదని గుర్తు చేశారు. అయినా, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన లీకులు ఢిల్లీ పెద్దలకు చేరాయని ఆ మంత్రి వివరించారు. ఇది ఇక్కడితో ఆగుతుందని తాను భావించడం లేదని, ఈ సమస్యను ఢిల్లీ పెద్దలు తమదైన శైలిలోనే పరిష్కరిస్తారని ఆ మంత్రి అభిప్రాయపడ్డారు.

English summary
The fight between union minister S Jaipal Reddy and chief minister Kiran kumar Reddy at peak level, as the leaders of the party vertically splitting making comments at each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X