డిజిపిగా దినేష్ రెడ్డి: ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

రెండు వారాలలోగా కొత్త డిజిపిని నియమించాలని, అప్పటి వరకు దినేష్‌ను ఇంచార్జ్‌గా ఉంచాలని సూచించింది. దినేష్ రెడ్డి నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాటు రూ.5వేల జరిమానా కూడా విధించింది. సీనియర్ ఐపిఎస్ అధికారుల జాబితాను యపిఎస్పీకి పంపించాలని, వారి సూచనల మేరకు సీనియారిటీ, సిన్సియారిటీ ప్రకారం కొత్త డిజిపిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
డిజిపి దినేష్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ అధికారి గౌతమ్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం క్యాట్ దినేష్ రెడ్డి నియామకాన్ని తప్పు పట్టింది. ఆయనను వెంటనే తొలగించి, కొత్త డిజిపిని నియమించాలని సూచించింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి దినేష్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురయింది.
వారం లోగా నియామక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా లేక హైకోర్టు తీర్పు మేరకు రెండు వారాల్లోగా కొత్త డిజిపిని నియమిస్తుందా అనే అంశం త్వరలో తేలనుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.