• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ టీమ్: ఒక గ్రూప్ జగన్‌తో, మరోటి భయంతో

By Pratap
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరగణం రెండుగా చీలి ఒక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లగా, మరో వర్గం కాంగ్రెసులోనే కొనసాగుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వైయస్ వర్గానికి చెందిన మంత్రులను తొలుత రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తమ మంత్రివర్గాల్లో కొనసాగించారు. కాంగ్రెసులో ఉండి, మంత్రి పదవులు అనుభవిస్తున్న వైయస్ రాజశేఖర రెడ్డి భక్తులు కేసుల ఉచ్చులో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు, లేదంటే కేసుల్లో ఇరుక్కున్నవారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావుకు చాలా మంది మంత్రులు మద్దతు తెలపడం భయం వల్లనే అంటున్నారు. ఈ పరిస్థితి రావడానికి వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగు లేకుండా వ్యవహరించి, పూర్తి భరోసా ఇవ్వడం వల్లనే అనేది విశ్లేషకుల అంచనా.

కాంగ్రెసు అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛను పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో అన్నీ తన ఇష్టప్రకారమే చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం వంటి ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు ప్రోత్సహిస్తూ ఆ పార్టీలను నిర్వీర్యం చేయడానికి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ ఫలితాలు ఇవ్వసాగాయి. దీంతో అధిష్టానం సంతోషంగా ఉందనే చెప్పాలి. అప్పటి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రతిదానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీలోని ప్రత్యర్థులను వైయస్ రాజశేఖర రెడ్డి ఊపిరాడకుండా చేశారు. ఎంతటి సీనియర్లయినా సరే, నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితిని కల్పించారు.

పార్టీ అధిష్టానం వద్ద చనువు ఉన్న వి హనుమంతరావు వంటి నేతలు మాత్రమే అప్పుడప్పుడు గొంతెత్తూ వచ్చారు. కానీ అవేమీ వైయస్ రాజశేఖర రెడ్డి ఆధిపత్యాన్ని కదిలించలేకపోయాయి. రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్‌ను కూడా లెక్కలోకి తీసుకున్న దాఖలాలు లేవు. అసలు 2009 ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకంలో పైచేయి సాధించి, తనకు ఎల్లవేళలా అనుయాయులాగా శాసనసభకు గెలిపించారు. వారంతా పార్టీకి కాకుండా వైయస్ కుటుంబానికే విధేయులుగా మారారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటివారు తమకు అధిష్టానం ఎవరో తెలియదని, తమకు తమ నాయకుడు వైయస్ మాత్రమేనని కూడా ప్రకటనలు చేసేదాకా పరిస్థితి వెళ్లింది. కొన్ని జిల్లాల్లో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అండగా నిలిచారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతులను ప్రోత్సహించడం ఇందుకు ఉదాహరణగా చెబుతారు. ఇలా చాలా జిల్లాల్లో జరిగింది. జూనియర్లుగా చెప్పే వైయస్ భక్తులంతా వైయస్ జగన్ వెంట సాగుతున్నారు.

పదవులను అంటిపెట్టుకుని కాంగ్రెసులో సాగుతున్నవారు ఇప్పుడు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టయినప్పుడు కాస్తా కలకలం రేగింది. కానీ ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చడంతో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. అందుకే రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు ధర్మాన ప్రసాద రావుకు మద్దతుగా నిలుస్తున్నారు.

రఘువీరా రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి శిష్యుడు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణను వైయస్ రాజశేఖర రెడ్డి రక్షించారని వైయస్సార్ కాంగ్రెసు నాయకులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మిగతా నలుగురు మంత్రులు కూడా అంతే. సబితా ఇంద్రారెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి చేవెళ్ల చెల్లెమ్మ. గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివ రావు వంటి నాయకుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కన్నా లక్ష్మినారాయణను వైయస్ ప్రోత్సహించారు. పొన్నాల లక్ష్మయ్యను వైయస్ పూర్తిగా ప్రోత్సహించారు. దాంతో వైయస్ అండతో తమకు తిరుగు ఉండదని చాలా మంది భావించారు.

నిజానికి, వైయస్ హయాంలో భూకేటాయింపులపై, కబ్జాలపై వి హనుమంతరావు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ వచ్చారు. అయితే, వైయస్ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధానాలనే వైయస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారు. చంద్రబాబు హయాంలోని చాలా పథకాలను మళ్లీ సమీక్షించి, వాటికి మార్పులు చేర్పులు చేశారు. ఈ వ్యవహారాల్లో తనకు సన్నిహితులైన మంత్రులను భాగస్వాములను చేశారు. అధికార యంత్రాంగంలో కూడా ఒక వర్గం వైయస్ భక్తిని స్వీకరించింది.

ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావును, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు మీడియా కావాలంటూ తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మీడియా రంగంలోకి దించారు. దాంతో సాక్షి టీవీ చానెల్, పత్రిక పురుడు పోసుకున్నాయి. వీటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఓ పండుగగా, అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వీరప్ప మొయిలీ కూడా వచ్చారు. ఇన్ని జరుగుతున్నా కాంగ్రెసు అధిష్టానం ఎక్కడా సమీక్షించినట్లు లేదు. పూర్తిగా వీరప్ప మొయిలీకి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను వదిలేశారు. వైయస్ ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. తీరా చూస్తే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది.

English summary
YS Rajasekhar reddy camp is now in two groups, one is in YS Jagan's YSR Congress party and another is in Congress with facing trouble. The situation for Congress raised due to the complete freedom granted to YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X