కసబ్‌ను నేను ఉరితీస్తా: ముందుకొచ్చిన పవన్ జలాద్

దేశంలో ఆఖరిసారి 2004లో కోల్‌కతాలో ధనుంజయ్ చటర్జీని ఉరి తీశారు. చటర్జీని ఉరి తీసిన నాటా ముల్లిక్ 2009లో చనిపోయాడు. కసబ్‌ను ఉరి తీయడానికి ముందుకు వచ్చిన పవన్ జలాద్ తండ్రి మమ్మూ జలాద్ కూడా ఉరి తీయడంలో ఆరితేరినవాడు. ఢిల్లీ జైళ్లలో దాదాపు 47 ఏళ్ల పాటు తలారిగా సేవలు అందించాడు. ఇందిరాగాంధీ హంతకులు సహా 12 మందికి ఉరిశిక్షలు అమలుచేశాడు. 2011లో మమ్మూ చనిపోయాడు. కసబ్‌ను ఉరితీయాలన్నది మమ్మూ చివరి కోరిక. తన తండ్రి చేయలేని పనిని తాను చేస్తానని పవన్ జలాద్ చెబుతున్నాడు.
కసబ్‌ను బహిరంగంగా ఉరితీయాలని పవన్ జలాద్ డిమాండ్ చేశాడు. ఇక మహారాష్ట్రలో చిట్ట చివరి తలారి 1996లో రిటైరయ్యారు. కానీ, అసలు ఉరి తీయాలంటే తలారే ఎందుకు ఓ సాధారణ కానిస్టేబుల్ అయినా సరిపోతాడని చెబుతున్నారో మహిళా డీఐజీ. ఎవరూ ముందుకు రాకపోతే తానే ఆ పని పూర్తిచేస్తానని కూడా అంటున్నారు. ఆమె ఎవరో కాదు... ప్రస్తుతం కసబ్‌ను నిర్బంధించిన ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ స్వాతి సాథే.
ఉరితీయడానికి తలారి అవసరమన్నది అపోహ మాత్రమేనని, జైలు మాన్యువల్ ప్రకారం చివరి అంకం సూపరింటెండెంట్ చేతుల మీదుగానే పూర్తవుతుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఉరితీతను పుణెలోని ఎరవాడ, నాగ్‌పూర్ సెంట్రల్ జైళ్లలో మాత్రమే అమలు చేస్తున్నారు. కాబట్టి కసబ్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిలో ఏదో ఒక జైలుకు బదిలీ చేసి, ఉరికంబం ఎక్కించాల్సి ఉంటుంది. ఉరితాడును బీహార్‌లోని బక్సర్ జైలులోనే తయారుచేస్తారు.












Click it and Unblock the Notifications