నిట్‌లో బమ్‌గేమ్ ర్యాగింగ్: కఠిన చర్యలన్న డైరెక్టర్

కాగా అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిట్‌లో ర్యాగింగ్ ఇటీవల కొత్త పుంతలు తొక్కతోంది. విద్యార్థులు వికృత చేష్టలతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడినా, ఆ విష సంస్కృతి మాత్రం నిట్‌ను వీడలేదు. వరంగల్ నిట్‌లో పుట్టిన రోజులు, ఉద్యోగ అవకాశాలు లభించిన రోజు పేరిట చిలిపి చేష్టలకు దిగటం పరిపాటిగా మారుతోంది. అంతేకాదు కొత్తగా ప్రవేశాలు పొందిన వారి పట్ల సీనియర్ల వికృత చేష్టలు విషాదం నింపుతున్నాయి.
గత సంవత్సరం ఆగస్టు 26న సాయంత్రం 5.30 గంటలకు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని మాధురి క్యాంపస్‌లోని హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 9వ స్నాతకోత్సవానికి సరిగ్గా 24 గంటలు ముందే జరిగిన ఈ సంఘటన క్యాంపస్‌లో సంచలనం సష్టించింది. కళాశాలలో చేరిన 10 రోజులకే మాధురి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ర్యాగింగ్ కారణమని మృతురాలి తండ్రి మోహన్ ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన వారం రోజులకే సెప్టెంబర్ 1న ఢిల్లీకి చెందిన ఎంటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి అంకుర్ భరద్వాజ్ తానుంటున్న హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అదే విద్యాసంవత్సరం చివరలో జూనియర్ విద్యార్థులను ఓ గదిలో బంధించిన సీనియర్లు వారిని చిత్ర హింసలకు గురి చేశారు. విద్యా సంవత్సరం మారడంతో ఈ ఏడాది సవ్యంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో విద్యార్థుల ఆకృత్యాలు మరోసారి వెలుగు చూశాయి. బమ్ గేమ్‌తో సీనియర్లు జూనియర్లపై వికృత చేష్టలతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ఖాజీపేట సిఐ రంగంలోకి దిగారు. నిట్‌ను సందర్శించి విద్యార్థులను విచారించారు. హాస్టళ్లను తనిఖీ చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజు నిట్‌లో నిరవహించిన సన్మాన కార్యక్రమానికి నిట్ చైర్మన్ హాజరయ్యారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బమ్ గేమ్ పేరుతో నిట్‌లో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆయన మీడియాలో వార్తలు చూసి డైరెక్టర్‌ను ఆ విషయంపై అడిగారు. నిట్‌లో బమ్ గేమ్ పేరుతో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లుగా తెలియడంతో దీనిపై ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్ ఆరా తీశారు.