నేపాల్, భారత్ పరస్పర ఆక్రమణలు..? ప్రధాని షాకింగ్..!
"నేపాల్ (Nepal) భారత్ (India)ను ఆక్రమించింది, అలాగే భారత్ కూడా నేపాల్ ను ఆక్రమించింది.." ఈ మాటలన్నది ఎవరో చిన్నా చితకా రాజకీయ నాయకుడు కాదు. స్వయంగా నేపాల్ ప్రధాని బాలెన్ షా (Balen Shah). జెన్ జీ ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో వారి ప్రతినిధిగా ఎంచుకున్న ప్రధాని బాలెన్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ తో ఆ దేశానికి ఉన్న పాత వివాదాల్ని మళ్లీ ఒక్కసారిగా తెరపైకి తెచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా మరుగున పడిన సరిహద్దు వివాదం తిరిగి రాజుకుంది.
నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలనం (balen shah)
నిన్న నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాలెన్ షా.. రెండు దేశాలు ఒకరి భూభాగాన్ని మరొకరు ఆక్రమించుకున్నాయని పేర్కొన్నారు. నేపాల్ కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఈ ఏడాది ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత షా చేసిన మొదటి పార్లమెంటరీ ప్రసంగం ఇది. లిపులేఖ్, లింపియాధురా, కాలపాని ప్రాంతాలపై ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం దైపాక్షిక సంబంధాలలో కీలక సమస్యగా కొనసాగుతోందని బాలెన్ షా అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.

భారత్, నేపాల్ పరస్పర ఆక్రమణ
"నేను ప్రధాని అయిన తర్వాతే ఒక వాస్తవం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. భారతదేశం నేపాల్ భూభాగాన్ని ఆక్రమించడమే కాకుండా, అనేక ప్రాంతాలలో నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించింది," అని ఆయన వివరించారు. ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి "ఇప్పుడు రెండు దేశాలు వాస్తవాలను అధ్యయనం చేసి స్నేహితులుగా కూర్చుని సమస్యను పరిష్కరించాలి," అని బాలెన్ షా పిలుపునిచ్చారు. అంతేకాకుండా, కాఠ్మండు ఈ విషయాన్ని చైనా, బ్రిటన్‌లతో కూడా చర్చించిందని పార్లమెంటు సభ్యులకు తెలియజేశారు. ఈ ప్రాంతంలో బ్రిటన్‌కు వలసవాద వారసత్వం ఉన్నందున ఈ చర్చలు జరిగాయని పేర్కొన్నారు.

నేపాల్ ప్రభుత్వం వివరణ
అయితే, ప్రధాని షా వ్యాఖ్యలపై కేవలం కొన్ని గంటల తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. నేపాల్ భారత భూభాగాన్ని 'ఆక్రమించుకుంది' అనే బాలెన్ షా వ్యాఖ్యలు ఎవరూ నివాసం ఉండని (నో-మ్యాన్స్ ల్యాండ్) ప్రాంతాలను, అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు దాటిన ఆక్రమణ సంఘటనలను సూచిస్తున్నాయని వెల్లడించింది. భారత భూభాగంలోని ప్రజలు వాడుకుంటున్న భూమి నేపాల్ భూభాగంలోకి రావచ్చని, అదేవిధంగా నేపాల్ పౌరులు వాడుకుంటున్న భూమి భారత భూభాగంలోకి ఉండవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications