విజయమ్మతో కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత భేటీ

ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం అన్ని పార్టీల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రజాస్వామ్యవాదులు ఫ్లోర్ లీడర్లు ఈ అంశాన్ని ప్రస్తావించాలని, నేతలు రిజల్యూషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఆమెకు ధన్యవాదాలు అన్నారు.
కాగా పది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కవిత కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సహకరించాలని ఆమె చంద్రబాబును కోరారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేయాలని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
తాము శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సానుకూలంగానే ఉన్నామని చంద్రబాబు కవితతో చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో ప్రభుత్వం నెలకొల్పే విధంగా తమ వంతు కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ కవిత కొంత కాలంగా ప్రచారోద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications