ఎస్పీని బంధించిన కానిస్టేబుల్, ఆరు గంటలు డ్రామా

Suspended cop detains SP, frees him after DGP calls
హైదారబాద్: ఓ ఎస్పీని సస్పెన్షన్‌కు గురైన హెడ్ కానిస్టేబుల్ బంధించిన సంఘటన బుధవారం సాయంత్రం తీవ్ర సంచలనం సృష్టించింది. తాను ఎస్పీ లక్ష్మీనారాయణను తాను బంధించానని, తాళ్లతో కట్టేశానని, తన వద్ద 40 లీటర్ల పెట్రోల్ ఉందని, షట్టర్ తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తానని పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పిటిఓ) కానిస్టేబుల్ కెఎన్ గిరిప్రసాద్ శర్మ బెదిరిస్తూ వచ్చాడు. పీటీవోలో జరుగుతున్న అక్రమాలను ఆయన బయటపెట్టారు. హోమ్ మంత్రి కూడా తనతో మాట్లాడాలని, పీటీవోలో జరుగుతున్న అవకతవకలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో గల ఓ దుకాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చివరికి రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో డ్రామా ముగిసింది. డిజిపి దినేష్ జోక్యం చేసుకోవడంతో డ్రామా ముగిసింది. గిరిప్రసాద్ శర్మ సస్పెన్షన్‌పై జరుపుతానని ఆయన హామీ ఇచ్చారు. దాంతో పరిస్థితి కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌లోని బిర్లామందిర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా దాదాపు ఆరు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత రేకెత్తించింది.

తనను వేధించి సస్పెండ్ చేసిన ఎఎస్పీ విజయ్‌కుమార్‌పైన, ఎస్పీపైనా చర్యలు తీసుకోవాలని హెడ్‌కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పిటిఓ)లో టెక్నికల్ విభాగం ఎస్పీగా పని చేస్తున్న లక్ష్మీనారాయణను గతంలో హెడ్‌కానిస్టేబుల్‌గా (పిటిఓలో) పని చేసి ఆరు నెలల కిందట సస్పెండ్ అయిన గిరిప్రసాద్ శర్మ నిర్బంధించాడు. లక్ష్మీనారాయణను తానే కిడ్నాప్ చేశానంటూ మీడియాకు ఎస్‌ఎంఎస్‌లు పంపించాడు.

క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - హెడ్ కానిస్టేబుల్ శర్మ బిర్లామందిర్‌కు వెళ్లే దారిలో గల తన షాపులో ఎస్పీని బంధించి లోపలి నుంచి షట్టర్ వేసుకున్నాడు. ఎస్పీని కిడ్నాప్ చేశానని, షట్టర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తే ఎస్పీని చంపి తాను చస్తానంటూ సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపించాడు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు రంగంలో దిగారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కరపత్రాన్ని ఆ షాపు షట్టర్‌కు అతికించాడు. తనను, తనతో పాటు ఎంతో మందిని పిటిఓ అధికారులు తీవ్రంగా వేధించారని, ఎఎస్పీ విజయ్‌కుమార్ తనను మానసికంగా హింసించాడని శర్మ ఆరోపించాడు. పిటిఓలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని, పిటిఓను కాపాడాలని, డ్రైవర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశాడు.

అసలు ఎస్పీ స్థాయి అధికారి హెడ్ కానిస్టేబుల్ ఉన్న ప్రాంతానికి ఒక్కరే రావాల్సిన పరిస్థితి ఏమొచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. తనకు, ఎస్పీకి ఉన్న గొడవల నేపథ్యంలో అడ్వకేట్‌తో మాట్లాడాలి రమ్మంటే కాదనలేక వచ్చానని ఎస్పీ వెల్లడించినట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ శర్మ అప్పటికే సిద్ధం చేసుకున్న తాళ్లతో ఎస్పీని కట్టివేశాడన్నది ఒక కథనం. దీనిపై మరో కధనం కూడా వినిపిస్తోంది.

తనను వేధించి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ఎఎస్పీ విజయ్‌కుమార్‌పై చర్య తీసుకోనందుకు మస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు మీరిద్దరే బాధ్యులని పేర్కొంటూ లేఖ రాసి చనిపోతున్నానని శర్మ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కలవరం చెందిన ఎస్పీ స్వయంగా తానే శర్మ వద్దకు రావడంతో బందీగా దొరికిపోయినట్టు తెలుస్తోంది.

ఈ విషయమై ఇప్పటివరకూ పోలీసు శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన రాత్రి 7 గంటలకు వెల్లడైంది. దీంతో బిర్లా మందిర్‌పైకి వాహనాలు వెళ్లే దారి వద్ద పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సైఫాబాద్ పోలీసులు, పిటిఓ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బిర్లా మందిర్‌పైకి వెళ్లే రహదారిలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మీడియా వాహనాలను పైకి అనుమతించలేదు.

ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కానిస్టేబుల్ శర్మతో సెల్‌ఫోన్‌లో మాట్లాడితే ముక్తసరిగా రెండు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. నీ ఉద్యోగం నీకు వస్తుంది, పిటిఓలో అవకతవకలపై విచారణ చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. అనవసరంగా ఎస్పీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

అయినప్పటికీ వినకుండా డ్రైవర్లను వెంటనే నియమించాలని, పిటిఓను పటిష్టం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని శర్మ డిమాండ్ చేశాడు. ఈ విషయాలన్నీ హడావుడిగా చెప్పి హోంమంత్రి మాట్లాడుతున్నా ఫోన్ కట్ చేశాడు. సస్పెండ్ అయిన తర్వాత మానసిక పరిస్థితి సరిగా లేక శర్మ కొంత కాలం నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+