ప్రభుత్వానికి రూ. 215 కోట్లు గండి: ఎమ్మార్‌పై సిబిఐ

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ 14 నెలలపాటు దర్యాప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. విజయరాఘవ, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. కోనేరు ప్రసాద్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
స్టైలిష్ హోమ్స్‌కు చెందిన రంగారావు ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. అందుకు సిబిఐ అంగీకరించింది. ఎపిఐఐసికి, ఎమ్మార్‌కు మధ్య జరిగిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఎపిఐఐసి వాటాను ఆరు శాతానికి తగ్గించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది. ఈ కుంభకోణంలో 45 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని మొదటి చార్జిషీట్‌లో చెప్పిన సిబిఐ మూడో చార్జిషీట్‌లో దాన్ని 215 కోట్ల రూపాయలుగా గుర్తించింది.
మూడో చార్జిషీట్ దాఖలుతో సిబిఐ దర్యాప్తు ముగిసినట్లేనని భావిస్తున్నారు. కోర్టులో విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కోనేరు ప్రసాద్ ప్లాట్లను విక్రయించాడని, కొన్ని ప్లాట్లను బ్లాక్ చేశాడని సిబిఐ ఆరోపించింది. ఈ కుంభకోణంలో సునీల్ రెడ్డికి డబ్బులు చేరాయని, అయితే అతని నుంచి డబ్బులు ఎవరికి చేరాయి, తుది లబ్ధిదారు ఎవరు అనే విషయాలను కూడా సిబిఐ చార్జిషీట్‌లో పొందుపరిచినట్లు చెబుతున్నారు. ఆయితే, ఈ విషయం బయటకు పొక్కడం లేదు. సిబిఐ 300 పేజీలతో ఈ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.












Click it and Unblock the Notifications