తెలంగాణపై అట్టుడికిన అసెంబ్లీ: నిరవధిక వాయిదా

Posted By:
Subscribe to Oneindia Telugu
Assembly
హైదరాబాద్: శానససభా సమావేశాలు ఏ విధమైన చర్చను చేపట్టకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ అంశంపై ప్రతి రోజూ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు శానససభా సమావేశాలను అడ్డుకుంటూ వచ్చారు. చివరి రోజు శనివారం కూడా తెరాస సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చి చివరకు నిరవధికంగా వాయిదా పడింది.

ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం నిరవధికంగా వాయిదా వేశారు. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఏ అంశాన్ని కూడా చర్చించలేకపోయారు. ఎటువంటి బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేదు. కేవలం వాయిదాలకే పరిమితం కావడంతో సభలో సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా లభించలేదు. దీంతో శానససభ్యులు మీడియా పాయింట్ వద్ద క్యూ కట్టారు.

సభ సజావుగా నడవకపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిందించారు. కాగా, సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తెలుగుదేశం సభ్యులు శానససభ ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలను చర్చించకపోవడం శానససభ చరిత్రలో ఇదే మొదటి సారి అని సిబిఐ నేత కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని ఆయన విమర్శించారు. సభ నడవకపోవడానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సభను అడ్డుకున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

శాసనసభకు తాము ఖర్చు పెట్టిన డబ్బునంతా ప్రభుత్వం వద్ద రికరవరీ చేయాలని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణపై తీర్మానం చేయాల్సి వస్తుందని ప్రభుత్వం పారిపోయిందని బిజెపి సభ్యుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి కుట్ర చేశాయని ఆయన అన్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు సభా సమయాన్ని వృధా చేశాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు మండిపడ్డారు. తెలంగాణపై తీర్మానం చేయకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పారిపోయాయని వారు విమర్శించారు. తెలంగాణపై ఐదు నిమిషాల్లో తీర్మానం చేసి, ఇతర అంశాలను సభలో చర్చకు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Assembly has been adjourned without taking any issue for debate. Telangana Rastra Samithi (TRS) MLAs obstructed assembly proceeding for five days demanding resolution on Telangana.
Please Wait while comments are loading...