చిరంజీవికి కేంద్ర పదవి: పిఆర్పీ సెగపై ముందు జాగ్రత్త!

ఇందులో ప్రధానంగా చిరంజీవి ఉంటారు. పిఆర్పీ విలీనం సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఖచ్చితంగా కేంద్రమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. చిరుకు కేంద్ర పదవి కట్టబెట్టే విషయంపై కాంగ్రెసు సీనియర్లు అప్పట్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెసులో విలీనమైన పిఆర్పీ క్యాడర్ మాత్రం అప్పుడు చిరుకు పదవిని కోరుకుంది. అయితే ఇప్పుడు చిరంజీవి సొంత వర్గం నుండి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందంటున్నారు.
విలీనం జరిగి ఇన్నాళ్లు అయినప్పటికీ రాష్ట్రంలో నామినెటెడ్ పోస్టులు భర్తీ చేయక పోవడం, పిసిసిని పునర్వవ్యవస్థీకరించక పోవడం వల్ల పిఆర్పీ క్యాడర్ నిమిత్త మాత్రంగానే ఉంది. వారు ఎప్పటి నుండో పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జరగబోయే విస్తరణలో చిరంజీవికి కేంద్రమంత్రి పదవి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
విలీనం జరిగి ఇంతకాలం గడుస్తున్నప్పటికీ తమకు ఎలాంటి పదవులు లేకుండా చిరు మాత్రం కేబినెట్లోకి వెళితే సొంత వర్గం నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశముందని చెబుతున్నారు. ఇన్నాళ్లయినా తమ పదవుల గురించి సీరియస్‌గా అటు కాంగ్రెసు పెద్దలతో కానీ ఇటు రాష్ట్ర నేతలతో గానీ చర్చించని చిరంజీవి కేబినెట్లోకి వెళితే ఆయన వర్గం ఖచ్చితంగా అసంతృప్తికి లోనవుతుందంటున్నారు. దానిని వారు బహిరంగంగా ప్రకటించక పోయినప్పటికీ నేరుగా చిరంజీవిని ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన వారి పదవుల కోసం చిరు ఫైట్ చేయని పక్షంలో వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ భయంతోనే చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదివారం రాత్రి కలిసి తన వర్గానికి నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇవ్వాలని కోరారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications