తెలంగాణపై దాటవేత ధోరణి: బాబుపై టిటిడిపి కినుక

సమావేశంలో చంద్రబాబు కేంద్రానికి రాయాల్సిన లేఖ పైన, తెలంగాణ పైన మాట్లాడక పోవడంతో ఆయన ఈ విషయంపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి టిటిడిపి నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు ప్రత్యేకంగా సమావేశమై బాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెల 30వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత ఇచ్చినా లాభం ఉండదని బాబుకు చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వారం రోజుల్లోనే తెలంగాణపై బహిరంగ ప్రకటన, కేంద్రానికి టిడిపి తరఫున లేఖ పంపించే విషయాలపై చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఒప్పించాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పటికీ బాబు స్పందించని పక్షంలో, ఒకవేళ స్పందించినా ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు.
ఇటీవల ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని, లేఖ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లామని, ఇప్పుడు వెనక్కి పోతే తీవ్ర నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా మొదట బాబును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి తదితర టిటిడిపి నేతలు ప్రత్యకంగా సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications