సిఎం వ్యాఖ్యలు: బాబుపై సిబిఐ దర్యాప్తు తప్పదా?

ఐఎంజి భూముల కేటాయింపుపై చంద్రబాబు మీద దర్యాప్తు జరిగే అవకాశాలున్నట్లు ముఖ్యమంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజికి అతి చౌకగా భూములు కేటాయించారనేది ముఖ్యమంత్రి ఆరోపణ. గచ్చిబౌలిలో ఐఎంజికి అతి చౌకధరకు 50 వేల రూపాయలకే కట్టబెట్టారని, అది కోటి రూపాయల చొప్పున ధర పలికేదని ఆయన అన్నారు. విమానాశ్రయం వద్ద కూడా 400 ఎకరాలు చంద్రబాబు ఓ సంస్థకు కట్టబెట్టాడని అన్నారు.
ముఖ్యమంత్రి మాటల్లోని ఆంతర్యం ఏమిటని పరిశీలిస్తే - ఐఎంజిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్టు ఎబికె ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు, విజయసాయి రెడ్డి కోర్టుకెక్కారు. దీనిపై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరినట్లు, సిబిఐ దర్యాప్తునకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. దానివల్లనే ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం కలిగింది.
అయితే, బుధవారం ముఖ్యమంత్రి కోర్టు విషయాన్ని కూడా ప్రస్తావించారు. కోర్టులో ఉన్నదాని గురించి తాను మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ఐఎంజి భూముల కేటాయింపును తమ కాంగ్రెసు ప్రభుత్వం రద్దు చేసి, సిబిఐ దర్యాప్తు కోసం 2007లోనే కోరిందని ఆయన గుర్తు చేశారు. సిబ్బంది కొరత కారణంగా సిబిఐ అప్పట్లో దర్యాప్తు చేపట్టలేదని చెప్పారు. అవినీతి జరగలేదని అనుకుంటే చంద్రబాబు స్వచ్ఛందంగా సిబిఐ దర్యాప్తునకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తాను సిబిఐ దర్యాప్తునకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications