తెలంగాణ: డికె అరుణ ఢిల్లీ యాత్ర వెనక కిరణ్?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజించి, పాలించు అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి చివరి మొఘల్ చక్రవర్తి ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. మంత్రి డికె అరుణ ఢిల్లీ వెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమానం టికెట్ కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎప్పుడూ తెలంగాణపై మాట్లాడకుండా మంత్రి డికె అరుణ ఇప్పుడు ఢిల్లీ వెళ్లడమేమిటని తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. డికె అరుణ ఢిల్లీ యాత్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆడిస్తున్న నాటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి తెలంగాణ తేవాలని లేదంటే డికె అరుణ రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
అయితే, తెలంగాణ వ్యతిరేకంగా అరుణ కాంగ్రెసు పెద్దలతో మాట్లాడడం లేదని, తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడుతున్నారని కొన్ని వర్గాలంటున్నాయి. డికె ఆరుణ మాదిరిగా మరింత మంది తెలంగాణ మంత్రులు అక్టోబర్ మూడో వారంలో ఢిల్లీ బాట పట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అరుణ మాదిరిగా తాము ఢిల్లీ వెళ్తామని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. అయితే, తాము వ్యక్తిగతంగా వెళ్లబోమని, బృందంగానే వెళ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications