కెసిఆర్‌కు కోదండతో విభేదాలు నిజమన్న టిఆర్ఎస్ నేత

ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, భిక్షపతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంగళవారం హన్మకొండలో వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. జాయింట్ యాక్షన్ అనే మాటలోనే వివిధ ఆలోచనలు ఉన్నట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. విభిన్న ఆలోచనలు ఉన్నా.. ఆకాంక్షపరంగా తెలంగాణ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ సాధనపై తెరాసకు ప్రత్యేక వ్యూహం ఉందన్నారు.
అలాగే ఐకాసలో ఉన్న ఇతర పార్టీలు, ప్రజాసంఘాలకు కూడా తమదైన వ్యూహం ఉంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ముందు సాగిలపడ్డారని ఆయన ఆరోపించారు. అందువల్లనే తెలంగాణ అంశాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించకుండా మౌనంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. 2014లో కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సోనియమ్మ కుమారుడు ప్రధాని కావాలనుకుంటే కచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందేనని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications