జగన్‌కోసం కిరణ్ రాయబారం, భేటీ తర్వాతే: పయ్యావుల

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఐఎంజి భూముల కేసులో సిబిఐ విచారణ జరిపిస్తానని కిరణ్ చెప్పడం సరికాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాక పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విజయమ్మతో ప్రణబ్ భేటీ పూర్తైన తర్వాతే కిరణ్ తమ పార్టీ అధినేతపై సిబిఐ దర్యాఫ్తు అని చెప్పారని గుర్తు చేశారు.
ఐఎంజి కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి నేత సిబిఐని సమాచారం అడిగితే, దానిని తీసుకొని జగన్‌కు చెందిన విజయ సాయి రెడ్డి కోర్టుకు వెళ్తాడని, ఇప్పుడు కిరణ్ కోర్టు తీర్పు కంటే ముందే తీర్పు చెబుతున్నారని, ఇదంతా చూస్తుంటే ఓ కుట్ర ప్రకారం జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెసు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని, ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు కూడా బాబుకు వ్యతిరేకంగా సేకరించలేక పోయిందని చెప్పారు.
కిరణ్ మాటలను చూస్తుంటే వారు జడ్జీలతో ఏమైనా మాట్లాడుతున్నారా అనే అనుమానం వస్తుందన్నారు. కోర్టులో విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి కోర్టులను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications