ఐఎంజి భూములు: బిల్లీరావుపై మండిపడ్డ హైకోర్టు

ఐఎంజీ భారత్ సంస్థకు భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కారుచౌకగా నగర సమీపంలో అత్యంత ఖరీదైన భూములను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారని, దీనిపై సీబీ ఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది టి.శ్రీరంగరావు, పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, విజయసాయిరెడ్డి ప్రజాహిత వాజ్యాలు(పిల్స్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో గత విచారణ సమయంలో - కోర్టు ఆదేశాలు ఇచ్చే ముందు బిల్లీరావు తరపు న్యాయవాది తమకు నోటీసులు ఇవ్వలేదని అంటూ తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వరాదని అభ్యంతరం చెప్పారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇస్తూ హైకోర్టు రెండు వారాలు గడువిచ్చింది. ప్రస్తుతం ఇవి విచారణలో ఉన్నాయి.
ఇదిలావుంటే, ఐఎంజీకి భూముల కేటాయింపులపై సిబిఐ విచారణ కోరుతూ 2006లో ప్రభుత్వం జారీచేసిన జీవో 310 కొట్టివేయాలంటూ బిల్లీరావు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2006లో సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను ఇప్పుడెలా సవాల్ చేస్తారని ప్రశ్నించింది.
ఇన్ని రోజులు ఎందుకు వేచి ఉండాల్సి వచ్చిందని, ఈ పిల్స్‌లో కౌంటర్ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఇచ్చామని, మీరు చెప్పదల్చుకున్నది ఆ కౌం టర్‌లో చెప్పండని ధర్మాసనం స్పష్టం చేసింది. "హైకోర్టులో పిల్స్ విచారణలో ఉన్న విషయం తెలియదని బుకాయించడం సరికాదు. మీ పిటిషన్‌ను పరిశీలిస్తే అన్ని విషయాలు మొదటి నుంచి గమనిస్తున్నట్లే ఉంది. దీనిని తక్షణం ఉపసంహరించుకోకపోతే భారీ జరిమానా విధించాల్సి వస్తుంది'' అని హెచ్చరించింది. దీంతో ధర్మాసనం అనుమతితో బిల్లీరావు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.