తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో రాఘవ లారెన్స్- విజయ్ ఎత్తుగడ
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం క్రమంగా కుదురుకుంటోంది. విజయ్ ఢిల్లీ పర్యటనకు సైతం వెళ్లొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. అటు పాలనపై కూడా విజయ్ పట్టు పెంచుకుంటోన్నారు. మళ్లీ ప్రజలతో మమేకం అయ్యే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఈ క్రమంలో తిరుచిరాపల్లిలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు కూడా.
జూన్ 1న సోమవారం ఈ సభ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ నిర్వహించిన మొదటి బహిరంగ సభ అదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన నియోజకవర్గం కూడా అదే. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేసిన విజయ్.. రెండు చోట్లా విజయదుందుభి మోగించారు. పెరంబూర్ స్థానంలో కొనసాగుతూ తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రిగా తన మొదటి బహిరంగ సభను అక్కడే నిర్వహించారు విజయ్. ఈ సభ తర్వాత అనూహ్య పరిణామలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని విజయ్ ప్రయత్నిస్తోన్నారు. ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఉప ఎన్నికపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి తన తోటి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ను అభ్యర్థిగా ప్రకటించాలని విజయ్ యోచిస్తోన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే తిరుచ్చి తూర్పు నియోజకవర్గం కోసం లారెన్స్ పేరు తెరపైకి వచ్చింది. మధ్య తమిళనాడు జిల్లాలో పునాదులు బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీకేకు ఈ నియోజకవర్గం అత్యంత కీలకం.
దీంతో అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మాస్ హీరో ఇమేజ్ మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా రాఘవ లారెన్స్ కు పోటీ చేసే అవకాశం కాల్పించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని లారెన్స్ కూడా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications