తెలంగాణ ఆర్థిక వసూళ్లలో ఆసక్తికర గణాంకాలు: ఆదాయంలో హైదరాబాద్ టాప్..ఖర్చులో ఈ జిల్లా!
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరు నెలల ఆదాయ, వ్యయాల గణాంకాలు జిల్లాలవారీగా కీలకమైన అంశాలను వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల ఆదాయ, వ్యయాల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే రెవెన్యూ వసూళ్లలో రాజధాని హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, ప్రభుత్వ ఖర్చులు లేదా రెవెన్యూ వ్యయం విషయంలో మాత్రం రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉంది.
జిల్లాల వారీగా ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి పనుల కేటాయింపుల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం, రాష్ట్ర రెవెన్యూ వసూళ్లలో హైదరాబాద్ జిల్లా ఏకంగా రూ.84,746.81 కోట్ల భారీ ఆదాయంతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని వాణిజ్య కార్యకలాపాలు, పారిశ్రామిక సంస్థలు, సర్వీస్ సెక్టార్ మరియు రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా ఈ ప్రాంతం పరిధిలోనే కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

ఇక రూ.18,486.84 కోట్ల రెవెన్యూ వసూళ్లతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు స్వల్ప వసూళ్లను సాధించగా.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలు ఆదాయ సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, ప్రభుత్వ వ్యయం లేదా జిల్లాలవారీగా జరుగుతున్న ఖర్చుల పరిశీలనలో రంగారెడ్డి జిల్లా రూ.3,428.35 కోట్ల రెవెన్యూ వ్యయంతో అగ్రస్థానంలో నిలిచింది.
నల్గొండ రూ.2,690.21 కోట్లు, వరంగల్ అర్బన్ రూ.2,408.59 కోట్లు, ఖమ్మం రూ.2,277.98 కోట్లు, నిజామాబాద్ రూ.2,153.36 కోట్లు జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ములుగు రూ.563.79 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి రూ.467.24 కోట్లు జిల్లాలు ఖర్చుల పరంగా వెనుకబడి ఉన్నాయి.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల మధ్య కేంద్రీకృతమైన ఆర్థికాభివృద్ధి మిగతా జిల్లాలతో పోలిస్తే భారీ అంతరానికి కారణమవుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, పరిపాలనాపరమైన వ్యయాలు జిల్లాలవారీగా మారుతున్న తీరును ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి ఈ డేటా కీలకం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications
