యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై తకరారు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ పరిస్థితుల్లో సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు. దేశ రాజధాని వేదికగా ఈ రెండు పార్టీల మధ్య నేడు మొదటి విడత చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు చర్చలు ప్రారంభమౌతాయనే విషయంపై ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రెండు మూడు రోజుల్లోనే చర్చలు ఉండొచ్చని ఏఐసీసీ చెబుతోంది.

ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమను 181 అసెంబ్లీ స్థానాలు కోరిందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సీట్ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ 100 స్థానాలు మాత్రమే అడిగిందా అన్న ప్రశ్నకు ఆయన సెటైరికల్ గా స్పందించారు. కాంగ్రెస్ కు వంద సీట్లు అనేది చాలా తక్కువ అని, 180 కి మరొకటి కలిపి మొత్తం 181 స్థానాలను కాంగ్రెస్ ప్రతిపాదించిందని తెలిపారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 403 స్థానాల్లో ఏకంగా 181 నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఒక జాబితాను సమర్పించింది కూడా. ఇప్పుడీ జాబితాపై చర్చించాల్సి ఉండగా.. అవి వాయిదా పడ్డాయి. దీనికోసం అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, యూపీసీసీ చీఫ్ ఆరాధన మిశ్రా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఇమ్రాన్ మసూద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ రాజేంద్ర పల్ గౌతమ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. సీట్ల పంపకాల విషయంలో అఖిలేష్ యాదవ్ మాత్రం స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఏకంగా 181 సీట్లను కాంగ్రెస్ కు ఇవ్వడానికి ససేమిరా అంటోన్నారాయన. కాంగ్రెస్ ఇచ్చిన జాబితాపైనా అభ్యంతరం తెలిపారు. ఇందులో మార్పులను ప్రతిపాదించారు. గెలిచే అవకాశాలు ఉన్నచోట మాత్రమే సీట్లు ఇవ్వాలని ఆయన ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు.
మరోవంక.. యూపీ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తన అంతర్గత సన్నాహాలను వేగవంతం చేసింది. 10 రాజాజీ మార్గ్‌లో ఉన్న మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ, రాజేంద్ర పాల్ గౌతమ్, ఆరాధనా మిశ్రా, ఇమ్రాన్ మసూద్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వీరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. గెలుపు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.















Click it and Unblock the Notifications
