Nagarjuna Sagar: 1700 ఏళ్ల చరిత్ర.. నీటి అడుగున నిద్రపోతున్న అద్భుత నగరం..
మనం కట్టే ప్రతీ అభివృద్ధి ప్రాజెక్టు వెనుక ఒక చరిత్ర కరిగిపోతుంది. కానీ, ఒక పూర్తి నగరమే నీటి అడుగున సమాధి అయిపోయిందంటే నమ్ముతారా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టకముందు అక్కడ ఏం జరిగిందనే విషయం తలచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగంగా ఒక బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పుడు, దాని కింద కేవలం భూములు మాత్రమే కాదు.. సుమారు 1700 సంవత్సరాల నాటి అపురూపమైన చారిత్రక సంపద, ఒక మహానగరం నీట మునిగిపోయింది. అదే ఇక్ష్వాకు రాజుల రాజధాని అయిన 'విజయపురి'!
ఇక్ష్వాకుల వైభవం..
ఇనుప యుగం నుంచి బౌద్ధ మత వికాసం వరకు ఆ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందింది. క్రీస్తుశకం మూడు, నాల్గవ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజుల పాలనలో ఈ ప్రాంతం సువర్ణయుగాన్ని చూసింది. బౌద్ధ భిక్షువుల పవిత్ర పాదాలు మోపిన నేల ఇది. భారీ స్థూపాలు, అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు, వేలాది మంది ప్రజలతో ఆ లోయ నిత్యం కళకళలాడుతూ ఉండేది. కాలక్రమేణా మట్టిలో కలిసిపోయిన ఆ చారిత్రక ఆనవాళ్లను పురావస్తు శాఖ వెలికితీసినప్పుడు ప్రపంచమే విస్మయానికి గురైంది. ఆ ప్రాంతం కేవలం ఒక భూభాగం కాదు.. అదొక నాగరికత పుట్టినిల్లు.

డ్యామ్ నిర్మాణం..
దేశానికి సాగునీరు, విద్యుత్ అవసరాల కోసం 1950లలో నాగార్జున సాగర్ భారీ ఆనకట్ట నిర్మాణానికి అడుగు పడింది. ప్రాజెక్ట్ పూర్తైతే ఆ లోయ అంతా నీటిలో మునిగిపోతుందని ప్రభుత్వాలకు, పురావస్తు నిపుణులకు ముందే స్పష్టమైంది. ఆ చారిత్రక సంపద నీళ్ల పాలైపోతే భావితరాలకు చరిత్ర లేకుండా పోతుందని భావించిన శాస్త్రవేత్తలు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నీళ్లు వచ్చి ఆ నగరాన్ని ముంచెత్తడానికి ముందు, సుమారు ఆరేళ్ల పాటు ఆ వ్యాలీ అంతా అణువణువు తవ్వేశారు. చరిత్రను కాపాడుకోవడానికి భూమిని తవ్వి వెలికితీసిన ఆ మహా యజ్ఞం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టం.
రాయిరాయిగా విడదీసి.. కొండపైకి చేర్చిన అద్భుత ఇంజనీరింగ్
ఇక్కడే చరిత్రలో ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతం జరిగింది. దేవుళ్ల విగ్రహాలు, బౌద్ధ స్థూపాలు, పురాతన కట్టడాలను అలాగే వదిలేస్తే నీట మునిగిపోతాయి. దీంతో నిపుణులు ఒక సాహసానికి తెరలేపారు. ప్రాచీన కట్టడాలను ప్రతీ రాయిని నంబరింగ్ వేసి, విడదీసి.. పక్కనే ఉన్న ఎత్తైన కొండపైకి ఒక్కో రాయిని మోసుకెళ్లారు. అచ్చం పాత రూపం ఎలా ఉందో, ఏమాత్రం చెక్కుచెదరకుండా మళ్లీ అదే శైలిలో ఆ కొండపై ఆ కట్టడాలను పునర్నిర్మించారు. మనుషుల తెలివితేటలు, చరిత్రపై ఉన్న మమకారం ప్రకృతిని సైతం ఎలా శాసించగలదో ఇక్కడ నిరూపితమైంది.
నీటి అడుగన నిద్రపోతున్న మహా నగరం
చివరకు 1960లో ప్రాజెక్టులోకి నీరు వచ్చి ఆ మహా నగరం మొత్తాన్ని తనలో కలుపుకుంది. అప్పటివరకు సంచలనాలు సృష్టించిన విజయపురి నగరం పూర్తిగా కనుమరుగై, జలజల పారే నీటి అడుగున నిద్రలోకి జారుకుంది. కానీ, మానవ ప్రయత్నంతో రక్షించబడిన ఆ చారిత్రక కట్టడాలు మాత్రం నీటి మధ్యలో ఒక సుందరమైన ద్వీపంగా మిగిలిపోయాయి. అదే నేడు మనం చూస్తున్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం 'నాగార్జున కొండ'. నాగార్జున సాగర్ నీటి అలల కింద ఒక నగరం శాశ్వతంగా కనుమరుగైపోయినా.. ఆ కొండపై మాత్రం చరిత్ర ఇప్పటికీ సజీవంగానే ఊపిరి పీల్చుకుంటూనే ఉంది!














Click it and Unblock the Notifications
