సాగర గర్భంలో రెండేళ్లు.. ఉత్కంఠ రేపిన బుద్ధుడి కథ!
హైదరాబాద్ అనగానే మనందరికీ ఇమీడియట్‌గా గుర్తుకువచ్చే చారిత్రక చిహ్నాలు చార్మినార్, ట్యాంక్ బండ్ పై కొలువుదీరిన బుద్ధుని విగ్రహం. 1591లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్ భాగ్యనగరానికి ఏ విధంగా ప్రతీకగా నిలిచిందో.. సరిగ్గా అదే స్థాయిలో నగర ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు అద్దం పడుతూ నిల్చుంది ఈ పొడవాటి గౌతమ బుద్ధుని విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహంగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ అద్భుత శిల్పం వెనుక ఎన్నో సాహసాలు, సవాళ్లు, ఉత్కంఠభరితమైన మలుపులు దాగి ఉన్నాయి. అసలు ఈ భారీ విగ్రహానికి ఉపయోగించిన ఏకశిల రాయి ఎక్కడ దొరికింది? దానిని శిల్పంగా మలచడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ వీకెండ్ స్పెషల్ స్టోరీలో ఆ ఆసక్తికర విశేషాలు మీకోసం ప్రత్యేకంగా..
'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' చూసి ఎన్టీఆర్ చేసిన ఆలోచన
నవంబర్ 1980లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారు అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'ని సందర్శించారు. అక్కడ విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్న తీరును చూసి ఆయనొక అద్భుతమైన ఆలోచన చేశారు. మన హైదరాబాద్‌లో కూడా అందమైన హుస్సేన్ సాగర్ లేక్ ఉందని, అందులో మధ్యలో 'జిబ్రాల్టర్ రాక్' అనే పెద్ద రాయి ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉందని ఆయన గుర్తించారు. ఆ రాక్‌ను పెడెస్టల్ గా ఉపయోగించి అక్కడ ఒక భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలనే గొప్ప సంకల్పాన్ని ఆయన మనసులో విత్తుకున్నారు. హైదరాబాద్‌కు తిరిగి రాగానే ప్రసిద్ధ సాంప్రదాయ శిల్పకళా నిపుణుడు ఎస్ఎం.గణపతి స్థపతిని, ప్రముఖ ఇంజనీర్లను నేరుగా పిలిపించి.. న్యూయార్క్‌లోని 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' తరహాలో లేదా కనీసం 85 అడుగుల ఎత్తైన విగ్రహం మన నగరంలోనూ ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు.

రాయగిరి కొండల్లో దొరికిన దైవ రూపం.. ఏకశిల అన్వేషణ
ముఖ్యమంత్రి ఆదేశాలతో నిఖార్సైన ఒకే ఒక పెద్ద గ్రానైట్ రాయి కోసం అన్వేషణ మొదలైంది. చివరకు హైదరాబాద్‌కు సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి జిల్లా రాయగిరి కొండల్లో ఒక భారీ శ్వేత గ్రానైట్ శిల కంటపడింది. ఆ రాయిని చూడగానే శిల్పి గణపతి స్థపతికి అందులోనే బుద్ధుని రూపం దర్శనమిచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కారు ఆపి, చిన్నపాటి కొండెక్కి ఆ రాయిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నేరుగా ఎన్టీఆర్‌ను కలిసి, "సార్.. నేను రాయిని చూశాను, మీకు కావలసిన అద్భుత రూపం అందులోనే ఉంది. మీరు నిధులు సిద్ధం చేయండి, నేను ఇప్పటికే సిబ్బంది విధులను సిద్ధం చేశాను" అని ధైర్యంగా చెప్పారు.
కొండపై నుంచి కిందకు.. ఉత్కంఠభరితంగా రాయి తరలింపు
శిల్పి గణపతి స్థపతి నేతృత్వంలో వందలాది మంది సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఆ భారీ రాయిని కొండపై నుంచి ఎంతో జాగ్రత్తగా కిందకు దించారు. రాయగిరి కొండ నుంచి ఆ బండరాయిని హైదరాబాద్‌కు తరలించడమంటే సామాన్యమైన విషయం కాదు. దీనికోసం ప్రత్యేకంగా 100 టైర్ల భారీ లారీని సిద్ధం చేయాల్సి వచ్చింది. రాయగిరి నుంచి రాయి బయలుదేరిన క్షణం నుంచి ఉప్పల్ చేరే వరకు దారి పొడవునా ఊరు వాడ కదిలివచ్చి, ఈ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు రోడ్లపైకి బారులు తీరారు. ఈ భారీ లోడ్ బ్రిడ్జిల మీద నుంచి వెళితే కూలిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం, దారి పొడవునా ప్రత్యేకంగా కాజ్ వేలను నిర్మించింది. అలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆ బ్రహ్మాండమైన రాయి సురక్షితంగా హైదరాబాద్ నగరానికి చేరుకుంది.
ట్యాంక్ బండ్ ఒడ్డున శిల్ప సంపద.. నిరంతరం సాగిన శ్రమ
ఎన్టీఆర్ స్వయంగా చేతుల మీదగా ఈ మహాపనిని ప్రారంభించగా.. వందలాది మంది నిపుణులైన శిల్పులు రాత్రింబవళ్లు తేడా లేకుండా శ్రమించారు. సుమారు ఐదు సంవత్సరాల కాలం (1985-1990) పాటు చెక్కితేనే ఆ అద్భుత రూపం రూపుదిద్దుకుంది. అప్పట్లోనే ఈ విగ్రహం తయారీకి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది. శిల్పం పూర్తికాగానే హుస్సేన్ సాగర్ ఒడ్డు నుంచి నడి మధ్యలో ఉన్న జిబ్రాల్టర్ రాక్ వరకు దానిని చేర్చడం మరో అతిపెద్ద సవాల్‌గా మారింది. రోడ్డు మీద లారీపై రాయిని తరలించినంత సులువుగా, నీటిపై 350 టన్నుల బరువును రవాణా చేయడం అసాధ్యం. ఇందుకోసం 1990 మార్చి 10వ తేదీన ప్రత్యేకంగా ఒక బల్లకట్టును సిద్ధం చేశారు. కానీ విధి మరోలా తలచింది.. శిల్పాన్ని నీటిపై తరలిస్తున్న సమయంలో బ్యాలెన్స్ లోపించి, అనుకోని ప్రమాదం జరిగి ఆ బుద్ధుని విగ్రహం నీట మునిగిపోయింది. ఈ విషాద ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం యావత్ రాష్ట్రంను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సాగర గర్భంలో రెండేళ్లు.. కన్నీటి గాథ నుంచి పునరుజ్జీవనం
ఈ ఘోర ప్రమాదం తర్వాత ఆ విగ్రహం దాదాపు రెండేళ్ల పాటు హుస్సేన్‌సాగర్ గర్భంలోనే అలాగే ఉండిపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రులు వరుసగామారారు. మర్రి చెన్నారెడ్డి ఏడాది పాటే ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ తర్వాత 1990 డిసెంబర్‌లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనూ ఆ విగ్రహాన్ని బయటకు తీసే సాహసం జరగలేదు. ఆ తర్వాత 1992 అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక, ఎలాగైనా ఆ విగ్రహాన్ని బయటకు తీయాలనే పట్టుదలతో పనులు ప్రారంభించారు.
ఎన్టీఆర్ కల సాకారం.. భాగ్యనగరానికి కీర్తికిరీటం
అదే ఏడాది అత్యాధునిక సింగపూర్ టెక్నాలజీతో ప్రత్యేక క్రేన్లను రప్పించి, హుస్సేన్ సాగర్ నీటిలో మునిగిపోయిన బుద్ధుడి విగ్రహాన్ని ఎంతో ప్రయాసపడి విజయవంతంగా బయటకు వెలికితీశారు. అలా అన్ని అడ్డంకులను ఎదుర్కొని 1992 డిసెంబర్ 1న ఆ దివ్య విగ్రహాన్ని జిబ్రాల్టర్ రాక్ పై అత్యంత వైభవంగా ప్రతిష్టించారు. కాలచక్రం తిరిగి 1994లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడంతో నందమూరి తారకరామారావు మరోసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. అలా ఎన్టీఆర్ కన్న కల పూర్తిగా నిజమైన ఆ శుభతరుణంలో.. 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువుతో, అభయ ముద్రలో ఉన్న ఆ ఏకశిలా బుద్ధ విగ్రహం భాగ్యనగరానికి అసలైన కీర్తికిరీటంగా నిలిచి విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.














Click it and Unblock the Notifications
