విజయవాడ, శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు రెండు ప్రత్యేక రైళ్లు!
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అత్యంత వైభవంగా జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు కోస్తా రైల్వే శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి పుట్టపర్తికి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం శ్రీకాకుళం రోడ్ మరియు విజయవాడ నుండి బెంగళూరు సమీపంలోని యలహంక వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాల ప్రకారం.. విజయవాడ - యలహంక 07246/07247 ప్రత్యేక రైలు నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు యలహంకలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 23వ తేదీ రాత్రి 11.50 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంకకు చేరుతుంది.

ఈ రైలు గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, నంద్యాల, డోన్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం మరియు పుట్టపర్తి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. అలాగే, ఉత్తరాంధ్ర ప్రయాణికుల కోసం శ్రీకాకుళం రోడ్ - యలహంక 08555/08556 ప్రత్యేక రైలు అందుబాటులోకి తెచ్చారు. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే ఈ రైలు.. విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మీదుగా ప్రయాణించి నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో నవంబర్ 24న సాయంత్రం 5 గంటలకు యలహంకలో బయలుదేరి నవంబర్ 25 సాయంత్రం 5.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకోనుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ మరియు జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నవంబర్ 24 వరకు ఈ జయంతి వేడుకలు అంబరాన్నంటనున్నాయి.
నవంబర్ 18న రథోత్సవం, 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20, 21 తేదీల్లో సేవాదళ్ జాతీయ సదస్సులు జరగనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 22న జరిగే శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. నవంబర్ 23న హిల్‌వ్యూ స్టేడియంలో ప్రధాన వేడుకలు జరగనుండటంతో, భక్తులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.












Click it and Unblock the Notifications
