ఎవర్ని కించపర్చాలని, మావాళ్లేరి: పవన్ సినిమాపై కెకె

ప్రజలపై సినిమా ప్రభావం బాగా ఉంటుందన్నారు. అలాంటి సినిమాలో తెలంగాణ భాష, యాస, సంస్కృతిలను కించపరుస్తూ చూపిస్తున్నారని ఆరోపించారు. సినిమా పరిశ్రమలో మాఫియా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎవరిని కించపర్చాలని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీశారో చెప్పాలని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ హీరోలు ఎవరైనా పాపులర్ అయ్యారా అని అడిగారు.
థియేటర్ యజమానులు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ ఇతర ప్రాంతానికి చెందిన వారే సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తారన్నారు. పవన్ హీరోగా పూరీ జగన్నాథ్ తీసిన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, మాటలు ఎందుకొచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమాలో ఆ ప్రాంతం పట్ల అభ్యంతరకర సన్నివేశాలు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ కొద్ది మందికో మాత్రమే అవార్డులు వస్తున్నాయని అన్నారు. అదే ఇతర ప్రాంతానికి చెందిన వారికి చాలా ఆవార్డులు వస్తాయన్నారు. సినిమా ఇండస్ట్రీలోని తెలంగాణపై వివక్ష కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలోను అభ్యంతరకర సన్నివేశాలు తొలగించారన్నారు. ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణకు వ్యతిరేకమన్నారు. సినిమా ఫ్లెక్సీలు దగ్ధం చేస్తుంటే మాట్లాడేవారు విద్యార్థులు చనిపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. విద్యార్థుల్లో వారి అభిమానులు కూడా ఉన్నారన్నారు.
తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం దండయాత్ర జరగాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చాకే తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. ఆయన రాసిన లేఖకు వివరణ ఇవ్వాలని సూచించారు. టిడిపి స్పష్టత ఇస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications