అమెరికాలో కిడ్నాపైన సాన్వీ హత్య, బంధువు పనే...

సాన్వి సురక్షితంగా ఇంటికి తిరిగిరావాలని బంధుమిత్రులు దేవుళ్లకు మొక్కుకుంటున్న సమయంలోనే పాప దారుణ హత్య గురించి తెలిసింది. అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా సాన్వీ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. అమెరికాలో ఆమె ఆచూకీ కోసం కొవ్వొత్తుల ప్రదర్శన కూడా చేశాయి. అక్టోబర్ 22 వ తేదీన పాప తల్లిదండ్రులు తమ తమ పనులపై ఆఫీసులకు వెళ్లిపోయిన అనంతరం దుండగులు వీరి ఇంటికి వచ్చి సాన్వి నాయనమ్మ సత్యవతమ్మను దారుణంగా హతమార్చి పాపను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే.
చిన్నారి సాన్విని ఎత్తుకుపోయిన వ్యక్తులు అంత తేలికగా ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, ఇంటినుంచి విలువైన ఆభరణాలుగాని, డబ్బు గాని తస్కరించకుండా చిన్నారి సాన్విని మాత్రమే ఎందుకు అపహరించుకుపోయారు, సాన్వి నాయనమ్మ సత్యవతమ్మను దుండగులు అంత దారుణంగా ఎందుకు హతమార్చవలసివచ్చిందన్న కోణంలో దర్యాప్తు చురుకుగా సాగింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న తెలుగువారిని పోలీసులు క్షుణ్ణంగా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.
ఇందులో భాగంగానే రఘుని కూడా ప్రశ్నించగా, అతడి వద్దనుంచి మొత్తం సమాచారం పోలీసులకు అందింది. పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా ప్రాంతంలోని ఒక ఎపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శివ ప్రసాద్ రెడ్డి తల్లి అయిన సత్యవతమ్మ అక్టోబర్ 22 వ తేదీన దారుణ హత్య చేసి సాన్వీని ఎత్తుకుపోయారు. ఈ దుర్ఘటనలోనే హంతకులు చిన్నారి సాన్వీని అపహరించుకుపోయి శివ ప్రసాద్, లత దంపతులకు తీరని ఆవేదనను మిగిల్చారు. ప్రకాశం జిల్లా కుడుములకుంట్ల గ్రామానికి చెందిన సత్యవతమ్మ వయస్సు 63 సంవత్సరాలు.
ఆమె భర్త కొండా రెడ్డి. ఆమెకు శివ ప్రసాద్, కృష్ణా రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సాన్వీ హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాన్వీ గుండె, గొంతు మీద కత్తిపోట్లు ఉన్నట్లు ఎఫ్‌బిఐ గుర్తించింది. నిందితుడపుపై కిడ్నాప్, దోపిడీ, హత్య కేసులు నమోదు చేశారు. సాన్వీ బతికి ఉంటుందనే నమ్మకంతోనే ఇన్ని రోజులుగా గాలించినట్లు ఎఫ్‌బిఐ అధికారులు చెప్పారు. ఆస్తి తగాదాలే సాన్వీ హత్యకు కారణమని బంధువులు అంటున్నారు.












Click it and Unblock the Notifications