తెలంగాణ కార్డ్: సిఎం మార్పుపై పార్టీకి కిరణ్ కౌంటర్

సనత్‌నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డిలలో ఎవరికో ఒకరికి సిఎం పదవి కట్టబెట్టనున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కు కూడా ఈ విషయాన్ని అధిష్టానం చెవిలో వేసిందట. మీరు తప్పుకోవాల్సి ఉంటుందని కిరణ్‌కు అధిష్టానం చెప్పిందనే వ్యాఖ్యలు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ తన పదవి కాపాడుకునేందుకు తెలంగాణను ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.
మొదట్లో కిరణ్ పట్ల అసంతృప్తితో ఉన్న అధిష్టానం సెప్టెంబర్ ఆఖర్లో తెలంగాణ జెఏసి నిర్వహించిన తెలంగాణ కవాతును ప్రశాంతంగా ఎదుర్కోవడంలో విజయం సాధించడంతో ఆయన పట్ల కొంత సానుకూలంగా కనిపించింది. కానీ 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలవాలంటే ముఖ్యమంత్రి మార్పు తథ్యమని అధిష్టానం భావిస్తోందట. అందుకే ఆయనను తప్పించాలని చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో తెలంగాణ వ్యక్తికి ఇస్తే రాష్ట్రంలో తమకు సానుకూలత ఉంటుందని భావిస్తున్నారట.
ఇది తెలిసిన ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకునేందుకు తెలంగాణ కార్డును ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. కిరణ్‌ను మార్చకూడదంటూ పలువురు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలు కూడా పలువురు ఆమెకు ఇదే రకమైన విజ్ఞప్తిని చేశారు. అయితే తెలంగాణ నేతలనే కిరణ్ పరోక్షంగా ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.
నేరుగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం చేయలేని కిరణ్.. ఎమ్మెల్యేలను, పలువురు నేతలను ప్రయోగించి.. ముఖ్యమంత్రి మార్పు ఇప్పుడు అవసరం లేదని, కిరణ్ బాగానే పని చేస్తున్నారని చెబుతూనే... ఇష్యూను డైవర్ట్ చేసేందుకు.. సిఎం మార్పుకంటే ఇప్పుడు తెలంగాణపై తేల్చాల్సిన అవసరం ఉందని, ముందుగా అది తేల్చాలని అధిష్టానాన్ని కోరారట. ఇదంతా ముఖ్యమంత్రి వెనుక ఉండి నడిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications