ముందు సురేఖ ఆత్మహత్య చేసుకోవాలి: కెసిఆర్

ఒత్తిడికి గురై కొంత మంది అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల వాంగ్మూలాలు ఉన్నాయని, వాస్తవం ఏమిటో చూసుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశానికి పాదయాత్రకు విరామం ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరు కావాలని, అలాగే వైయస్సార్ కాంగ్రెసు నుంచి వైయస్ విజయమ్మ సమావేశానికి రావాలని ఆయన అన్నారు. అప్పుడే వారి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.
తెలంగాణపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలు రాతపూర్వకంగా తెలంగాణపై తమ వైఖరులను తెలియజేయాలని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశానికి తనతో పాటు రావాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను రమ్మని అడిగినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జెఎసి నాయకులతో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత కోదండరామ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అన్ని పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో అఖిల పక్ష భేటీకి వెళ్లాలని కోదండరామ్ అన్నారు. కాంగ్రెసు వైఖరి చెప్తే తాము చెప్తామని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంటే సరిపోదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరి స్పష్టం చేసి, రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతను కాంగ్రెసుపైనే వదిలేయకుండా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ తమ వైఖరులను వెల్లడించాలని ఆయన అన్నారు.
అఖిలపక్ష సమావేశానికి బిజెపి జాతీయ నేతలు హాజరు కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసుపై ఒత్తిడి తెచ్చే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు. అఖిల పక్ష భేటీకి ముందు బంద్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదిలావుంటే, కెసిఆర్ కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస మహిళా విభాగం కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. విజయమ్మ, సురేఖ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కాగా, తెలంగాణ కాంగ్రెసు నాయకులను, మంత్రులను తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి జాంబీలుగా అభివర్ణించారు. సోనియా ఆత్మ వారిలో ప్రవేశించి ఆడిస్తోందని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులను రాజకీయ సమాధి చేస్తే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. మంత్రులను పదవులను వదిలిచేందుకు తాను వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు బయట పులులు, లోపల పిల్లులు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెసు నేతలంగా మూకుమ్మడి రాజీనామాలు చేస్తే తెలంగాణ ఎందుకు రాదని ఆయన అడిగారు.
అధికారం కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం తెలంగాణ నాయకులదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications