జడ్జీలను కూడా మేనేజ్ చేశాడు: వైయస్‌పై బాబు

2004లో వైఎస్‌కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సతీశ్ రెడ్డి అని, అప్పుడు కో ఆపరేటివ్ ఎన్నికల్లో నిలబడడానికి సతీశ్ రెడ్డి పులివెందుల వెళ్లారని, ప్రచారంలో ఉండగా, ఒక ఊరులో ఆయనపై దాడి జరిగిందని, రక్షణ కోసం గన్‌మెన్ కాల్పులు జరపగా ఒకరికి గాయమైందని, రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి మెజిస్ట్రేట్‌ను రప్పించాడని, సతీశ్ రెడ్డే నేరుగా తుపాకీ తీసుకుని కాల్చారని తప్పుడు వాంగ్మూలం రాయించారని చంద్రబాబు వివరించారు.
సతీష్ రెడ్డిని శాశ్వతంగా జైలుకు పంపించే కుట్ర పన్నారని, నాటి సీఎంతో జడ్జి లాలూచీ పడినట్టు తర్వాత కోర్టు తేల్చిందని ఆయన అన్నారు. "100 రూపాయల నోట్లు 100 కట్టగా కడితే 10 వేలు. ఐదు వేలు, 10 వేల రూపాయల కట్టలను ఒక సంచిలో నింపితే 50 లక్షలు. అలాంటి సంచులు 200 అయితే లారీ నిండుతుంది. వాటి విలువ వెయ్యి కోట్లు. అలాంటి వెయ్యి లారీల డబ్బును లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు. ఇదీ జగన్ దోచిన డబ్బు. అందులో ఒక లారీ మీ ఊరికి పంపినా మీ కష్టాలు తీరుతాయి" అని చంద్రబాబు వివరించారు.
కాంగ్రెస్ దొంగలు అడవి పందుల్లా రాష్ట్రాన్ని మెక్కుతున్నారని అన్నారు. రాష్ట్రం నష్టం పోవడానికి వైయస్ పాలన కారణమైతే, రోశయ్య పాలన చతికిల పడిందని, కిరణ్ పాలన కిరికిరిగా సాగుతున్నదని అన్నారు. కాగా, తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పదు గానీ అన్ని పార్టీలను చెప్పమనడం ఎక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించడానికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణ సమస్య పరిష్కారానికి కాదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications