ముమ్మాటికి అదే!: హైదరాబాద్‌తో తెలంగాణ జానారెడ్డి

భేటీ అనంతరం జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఏర్పాటు తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. కేంద్రం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సామరస్యంగా విభజన జరగాలన్నారు. తెలంగాణ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదిన నేతలం ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. తీర్మానం కాపీని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తామని చెప్పారు.
ఆందోళనలు తీవ్రమై అభివృద్ధికి ఆటంకం కలుగక ముందే నిర్ణయం తీసుకోవాలన్నారు. కేవలం సమావేశాలే కాదని, కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరముందని ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సమావేసానికి హాజరు కాని వారిని కూడా సమన్వయం చేసుకోవాలని, వ్యతిరేక సంకేతాలొస్తే అందరం కలిసి పోరాడతామని మాజీ మంత్రి దామోదర రెడ్డి అన్నారు. 18న జైపూర్ మేధోమధనం సదస్సు సమయంలో తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు వస్తాయని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే విజయవాడ ప్రాంతీయ సదస్సును రద్దు చేశారని పార్టీ సీనియర్ నేత ఆమోస్ అన్నారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా 11 మంది మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం జానా రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీర్మాన కాపీని అందించేందుకు ఆయన వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాల నేతలు
తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసు నేతల పైనే తెలంగాణ భారం ఉందని వారు అన్నారు. వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని కోరారు. కాగా సమావేశ స్థలికి వస్తున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
....అందుకే హాజరు కాలేదు
తెలంగాణపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఇన్నానని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణపై నిర్ణయం వచ్చే వరకు ఏమీ మాట్లాడవద్దని సోనియా ఆదేశాలు జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందు వల్లే తాను సమావేశానికి వెళ్లలేదన్నారు. అధిష్టానం నుండి నిర్ణయం వచ్చిన తర్వాత హైదరాబాద్ గురించి మాట్లాడతానని చెప్పారు.
నల్గొండలో పలు కార్యక్రమాలు, శంకుస్థాపనలు ఉండటం వల్లే తాను తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశానికి హాజరు కాలేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు మంత్రులు కూడా అదే బాటలో నడిచి, అధిష్టానంపై ఒత్తిడి తేవాలన్నారు.












Click it and Unblock the Notifications