వరంగల్లోనూ వైయస్ రౌడీలను పెంచిపోషించారు: బాబు

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆయన గురువారం వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. దివంగత వైయస్ 2003లో 1468 కిలోమీటర్లు నడిచారు. చంద్రబాబు దానిని అధిగమించారు. గురువారం నాటికి ఆయన 1500 కిలోమీటర్లు పూర్తి చేశారు. వైయస్ పాదయాత్ర 33 నియోజకవర్గాల్లో కొనసాగగా.. బాబు యాత్ర 40 నియోజకవర్గాలు పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 1500 కిలోమీటర్లు దాటినందున సంగెం మండలం పల్లారుగూడ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చేసినట్టుగానే, వరంగల్ జిల్లాలోనూ వైఎస్.. ఓ రౌడీ రాజకీయ నాయకుడిని పెంచి పోషించారని, ప్రతాప రెడ్డి లాంటి తెలుగుదేశం నాయకులు వారి చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ఇలాంటి వారిని తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తోక పార్టీ అని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు అవినీతి తప్ప, అభివృద్ధి అక్కరలేదని విమర్శించారు.
తండ్రిని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ లక్ష కోట్లు దోచారని, 2004 కంటే ముందు వైయస్ కుటుంబం ఆస్తులతో ఇప్పటి వారి ఆస్తులను పోల్చితే ఎంతో దోపిడీ చేశారనేది అర్థమవుతుందన్నారు. నగదు బదిలీ పేరుతో పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నగదు బదిలీని మగవాళ్ల ఖాతాలో జమ చేస్తున్నారని, ఇదే జరిగితే ఆ డబ్బు బెల్టు షాపుల్లో ఖర్చవుతుందని చెప్పారు.
చంద్రబాబుకు తెలంగాణ సెగ
వరంగల్ జిల్లాలో వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. ఆయన పాదయాత్ర సందర్భంగా పలువురు యువకులు అడ్డుకొని జై తెలంగాణ అని నినాదాలు చేశారు. టిడిపి కండువాలు కప్పుకున్న ముగ్గురు యువకులు ఆయన బాబు సమీపానికి వెళ్లి జై తెలంగాణ అన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications