ఫొటోలు: చంద్రబాబుపై అలిగితే అంతే, ఎగ్జిట్ రెడీ..?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు నచ్చని విషయాలపై, నచ్చని నాయకుల వ్యవహారాలపై గుంభనంగా వ్యవహరిస్తారు. తనపై అలిగిన నాయకులను బుజ్జగించడానికి, వారికి నచ్చజెప్పడానికి ఇద్దరు, ముగ్గురు నాయకులను మధ్యవర్తులుగా పంపిస్తారు. అప్పటికి కూడా వినకపోతే వారి మానానికి వారిని వదిలేస్తారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా మెలిగి, ఆయనను నెత్తికి ఎక్కించుకుని, ప్రత్యర్థులపై తీవ్రమైన పదజాలంతో దాడులు చేసే నాయకులే ఎక్కువగా పార్టీకి, చంద్రబాబుకు దూరం కావడం చూస్తాం. చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని గిట్టనివారు అంటారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నాయకులకు కూడా పార్టీలో స్థానం భద్రం కాదని మొదటి నుంచి నిరూపితమవుతూ వస్తోంది.
గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ మొదలుకొని నేటి మోత్కుపల్లి నర్సింహులు వరకు అదే జరుగుతోంది. చంద్రబాబు మాటలకు, చేతలకు కాస్తా వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టిన ప్రతి నాయకుడికీ పార్టీలో ఉక్కపోసే పరిస్థితి ఏర్పడుతుందని, చివరకు పార్టీ నుంచి తనంత తానుగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంటారు. అలాంటి సందర్భాలు తెలుగుదేశం పార్టీలో చాలానే ఉన్నాయి. బేషరతుగా తిరిగి వస్తే చంద్రబాబు మళ్లీ ఆహ్వానించే పద్ధతిని ఇటీవలే అలవరుచుకున్నట్లు కనిపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ బోనమెత్తిన చంద్రబాబు మాటను జవదాటకూడదు. ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. పార్టీ జయాపజయాల బాధ్యతను కూడా ఆయన మోస్తున్నారు. పార్టీలో ఒకే ఒక్కడు చంద్రబాబు. పార్టీలో నెంబర్ టూ ఉండరు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహించేవారు. జన్మభూమి రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. సామాజిక వర్గాల సమీకరణాల్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. చంద్రబాబు వ్యూహాలతో తట్టుకోలేక కెసిఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారని అంటారు.

తూళ్ల దేవేందర్ గౌడ్ గురించి చెప్పనక్కరలేదు. తెలంగాణ విషయంలో దేవేందర్ గౌడ్ చంద్రబాబుతో పోరాటం చేసి, చివరకు బయటకు రావాల్సి వచ్చింది. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి తన తెలంగాణ ప్రజా పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి, తిరిగి తెలుగుదేశంలోకి వచ్చారు. మొదట్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీలో ఆయన నెంబర్ టూగా ఉండేవారు. ఇప్పుడు పది మందిలో ఆయనొక్కరు. కాకపోతే రాజ్యసభ సీటు దక్కింది.

ఇక, నాగం జనార్దన్ రెడ్డి కథ కూడా అదే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడంలో, చంద్రబాబుకు పూర్తి మద్దతు అందించడంలో నాగం జనార్దన్ రెడ్డి తెగువ చూపారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఉంటూ ఉద్యమ కార్యాచరణకు పదును పెట్టే క్రమంలో నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు రాక తప్పలేదు. ఆయన తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసుకున్నారు.

తాజాగా మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారాన్ని మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. తెలంగాణ విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు పరిచేందుకు మొక్కవోని దీక్షతో ఆయన పనిచేశారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌ను ఎదుర్కోవడంలో ఆయన పెద్ద పాత్రనే నిర్వహించారు. ఇప్పుడు ఆయనకు పార్టీలో ఊపిరి ఆడడం లేదు. పార్టీలో ఉంటారో, బయటకు వస్తారో తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications