అక్బర్ వెనుక జగన్, తెలంగాణపై కుట్ర: కెటిఆర్, హరీష్

Harish Rao - Kalvakuntla Taraka Rama Rao
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. మంగళవారం తెరాస ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావులు మాట్లాడారు. హైదరాబాద్‌లో అల్లర్ల వెనక జగన్ హస్తం ఉందని, జైల్లో ఉండే ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారని వారు ఆరోపించారు.

కేంద్రం ప్రకటనతో బెంబేలెత్తిన వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు ఉమ్మడిగా ఉద్రిక్తతల స్కెచ్ గీశాయని విమర్శిస్తోంది. తెలంగాణను అడ్డుకునేందుకు ఇది సీమాంద్రుల కుట్ర అని ధ్వజమెత్తింది. ఈ పరిణామాల వెనక కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంద్రులు ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, దాంతో ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా అల్లర్లు చేయిస్తున్నారన్నారు. సీమాంద్రుల కుట్రలను ప్రజలు సామరస్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణవాసులు శాంతికాముకులని, లోగడ ఇక్కడ వలసవాదుల కుట్ర రాజకీయ అధికారం కోసమే మత కల్లోలాలు జరిగాయని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం వెలువడే కీలక సమయంలో అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

ముస్లింలు, హిందువులూ అందరూ సంయమనం పాటించాలని, గొడవలకు పోతే తెలంగాణ కోసం జరిగిన పన్నెండేళ్ల పోరాటం కిందికి మీదికి అవుతుందని, తెలంగాణపై కేంద్రం విధించుకున్న గడువులో పన్నెండు రోజులు గడిచిందని, ఈ సమయంలో జరుగుతున్న పరిణామాలు కేంద్రం దృష్టి మరల్చడానికే అన్నారు. లేదా ఏదైనా కుట్ర దాగి ఉందా గుర్తించాలన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంద్రులు చేస్తున్న కుట్రలో భాగమే మత ఘర్షణలని, ప్రజలు అర్థం చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా జరిగే కుట్రను అడ్డుకునే శక్తి ఉద్యమానికి ఉందని బిజెపి ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం మల్లగుల్లాలు పడుతుండడంతో బెంబేలెత్తిన వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ పార్టీలు దానిని అడ్డుకునేందుకే కృత్రిమ ఉద్రిక్తతలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని కెటి రామారావు ఆరోపించారు. అక్బరుద్దీన్ వెనక వైయస్ జగన్ ఉన్నారని ఆరోపించారు.

శిఖండి రాజకీయాల ద్వారా తెలంగాణను అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ రెండు పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు వైయస్సార్ కుటుంబం యత్నిస్తోందని, ఇది ఆ కుటుంబానికి కొత్తేమీ కాదని విమర్శించారు. కేంద్రంలో తెరాస అధికారం పంచుకున్న సమయంలో వైయస్ కొందరు ముస్లిం మత పెద్దలను ఢిల్లీకి పంపి తెలంగాణ ఇస్తే మత ఘర్షణలు జరుగుతాయని ప్రచారం చేయించారని, ఇప్పుడు వాటిని నిజం చేసేందుకే చంచల్‌గూడ జైలు నుంచి జగన్ యత్నిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నప్పుడు తాము జగన్ వైపేనని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారని, తెలంగాణను అడ్డుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని నాలుగు రోజుల కిందట చెప్పారని, ప్రస్తుత పరిణామాలకు ఇవి అద్దం పడుతున్నాయని అన్నారు. ఒవైసీపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా కుట్ర కోణంలో తెర వెనుక సూత్రధారిని గుర్తించే దిశగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+