జగన్‌కు షాక్: రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెద్ద చెప్పలి సొసైటీకి జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బోగస్ ఓటర్లను చేర్పించారని రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా సహకార శాఖ అధికారికి గత డిసెంబర్ 31న లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో సహకారశాఖాధికారి సంతకం, కార్యాలయం సీలు ఉన్నాయి. ఆ ఫిర్యాదు తమకు 12వ తేదీ మాజీ మేయర్ స్వయంగా అందించారని, అయితే ఆ పత్రంలో ఉన్న కార్యాలయం సీలు, చేసిన సంతకం తమది కాదంటూ జిల్లా సహకార శాఖాధికారి చంద్రశేఖర్ లిఖిత పూర్వకంగా తెలుగుదేశం నేతలకు తెలియజేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ నేతలు సహకార శాఖాధికారులను నిలదీశారు.
గురువారం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సహకార శాఖాధికారులు ఓ పక్షానికి సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. అనంతరం పుత్తాతో పాటు మరికొందరు దేశం నేతలు ఎస్పీ మనీష్ కుమార్‌సిన్హా దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయమై పెద్ద చెప్పలి సొసైటీకి చెందిన కుంచం శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డిపై 420, 468, 471, 473 సెక్షన్ల కింద వన్‌టౌన్‌లో కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications