ఉండవల్లికి కెటిఆర్ రివర్స్: మోహన్‌బాబు క్యాసెట్

KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణ నేతల భాషను తప్పుపడుతూ కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు మోహన్ బాబు, ఆనం వివేకానంద రెడ్డి, పయ్యావుల కేశవ్, గుర్నాథ్ రెడ్డి మాటల వీడియో క్యాసెట్లను ప్రదర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉండవల్లిని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు అద్దె మైకుగా ఆయన అభివర్ణించారు. కెవిపి డైరెక్షన్‌లో ఉండవల్లి వీధినాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో వాటాల గొడవ వస్తుందని, తన బంధువుల ప్లాట్లు బయటపడతాయని, తాను జగన్ లాగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి కెవిపి రామచంద్ర రావు ఈ సభను పెట్టించారని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి 41 మంది శానససభ్యులను ఢిల్లీకి పంపించారని, ఓట్ల కోసం ఆ తర్వాత మాట మార్చారని, వైయస్ ప్రేతాత్మగా కెవిపి రామచంద్ర రావు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఉండవల్లి ఓ రంగస్థల నటుడని ఆయన అన్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభ ద్వారా సీమాంధ్ర నాయకులు మరోసారి తమ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, ఉన్మాదాన్ని ప్రదర్శించారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటని ఉండవల్లి వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి ఆంధ్ర నాయకులు చూపిన కారణాలనే తాము చూపుతున్నామని, అన్ని రంగాల్లో వివక్ష, అన్యాయం, దోపిడీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక అని అన్నారు. తెలంగాణ వ్యక్తి భాగస్వామ్యం లేకుండా జై ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించి, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీ నెత్తిన ఎక్కి కూర్చుంటామని చెప్పారని ఆయన అన్నారు.

షరతులు లేని సమైక్య రాష్ట్రం కావాలని లేదా ఆంధ్ర రాష్ట్రం కావాలని జై ఆంధ్ర ఉద్యమం నడిపారని, ముల్కీ నిబంధనలు న్యాయమని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో విచ్చలవిడి దోపిడీకి సమైక్య రాష్ట్రాన్ని కోరారని ఆయన అన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో 300 మంది మరణించారని, అప్పుడు జై ఆంధ్ర ఉద్యమ నేతల పిల్లలు ఎవరైనా చనిపోయారా అని ఆయన అన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో నేతల పిల్లలు ఎంత మంది చనిపోయారని ఆయన అడిగారు. సీమాంధ్ర నాయకుల ఉన్మాద వైఖరి వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు ప్రయత్నాలు చేయడం వల్ల తెలంగాణలో ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకుల ఉన్మాదం వల్లనే తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయని ఆయన అన్నారు.

ఉండవల్లి రాజ్యాంగ నిపుణుడి మాదిరిగా మాట్లాడుతున్నారని, అంబేడ్కర్‌పై గానీ, రాజ్యాంగంపై గానీ ఉండవల్లికి గౌరవం లేదని, దురదృష్టవశాత్తు అంబేడ్కర్ రాజ్యాంగం రాశారని ఉండవల్లి వ్యాఖ్యానించారని, అందుకు క్షమాపణ చెప్పి అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారని, అయితే అది మనసు నుంచి వచ్చిన క్షమాపణ కాదని ఆయన అన్నారు. 175 మంది మెజారిటీ శాసనసభ్యులతో తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో అడ్డుకుంటామని, తెలంగాణ ఏర్పడదని ఉండవల్లి అంటున్నారని, రాజ్యాంగం తెలిసినవాడైతే ఆ మాటను ఉండవల్లి అనబోరని ఆయన అన్నారు.

మెజారిటీ మందబలంతో మైనారిటీలను శాసించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 స్పష్టంగా చెబుతోందని, దుర్మార్గులు, ఉన్మాదులు ఉంటారు కాబట్టే మైనారిటీల హక్కులు కాపాడడానికి అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్‌ను పెట్టారని ఆయన అన్నారు. కెసిఆర్‌ను విమర్శిస్తే రాజమండ్రిలో ఉండవల్లికి నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని అనుకుంటే ఫరవా లేదని, కానీ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల గుండెలు మండుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించేపరిచే విధంగా ఉండవల్లి మాట్లాడారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులవి చిల్లర నాటకాలని ఆయన అన్నారు.

నెహ్రూ ప్రసంగాన్ని పార్లమెంటులో బిజెపి నేత సుష్మా స్వరాజ్ అవమానించారని ఉండవల్లి అంటున్నారని, ఉండవల్లి మాటలు పచ్చి అబద్ధాలని, విశాలాంధ్ర నినాదమే సామ్రాజ్యావాద ఆకాంక్షతో కూడుకున్నదని, ఇరు ప్రాంతాలను కలపడం ఆధునికమైన అంధ్ర అబ్బాయితో అమాయకమైన తెలంగాణ అమ్మాయికి పెళ్లి చేయడం వంటిదని నెహ్రూ అన్నారని చెబుతూ ఆనాటి పత్రికల నుంచి ఉటంకించారు. నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. మొదటి ఎస్సార్సీ ఫజలలీ కమిషన్ 1961 వరకు హైదరాబాద్, ఆంధ్ర విడివిడి రాష్ట్రాలుగా ఉండాలని, అప్పుడు అవసరమనుకంటే హైదరాబాద్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతోనే విలీనానికి సిద్ధం కావాలని సూచించిందని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు సమైక్య రాష్ట్రం కోసం వెంటపడ్డారని ఉండవల్లి అనడాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డి తదితర తెలంగాణ నేతలంతా తెలంగాణ విడి రాష్ట్రంగానే ఉండాలని అన్నారని, ఆనాటి అసెంబ్లీ ప్రొసిడింగ్స్ కూడా ఉన్నాయని అన్నారు.

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అది పనికిమాలిన రాజధాని అని, ఒక జిల్లాకు కేంద్రంగా ఉండే తాహతు కూడా కర్నూలుకు లేదని ఆంధ్ర నాయకులే అప్పుడు అన్నారని, గూడారాల కింద రాజధాని ఏర్పాటైందని చెప్పారు. అప్పటికే హైదరాబాద్ దేశంలో ఐదో పెద్ద నగరంగా అభివృద్ది చెందిందని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర నాయకులు దిక్కు లేక హైదరాబాద్ వచ్చారని, చెప్పుల్లేకుండా హైదరాబాద్ వచ్చి కోటీశ్వరులయ్యారని ఆయన అన్నారు. నోటికి ఎంత వస్తే అంత ఉండవల్లి మాట్లాడారని ఆయన అన్నారు. తమను దొంగలంటారా అని ఉండవల్లి అడుగుతున్నారని కెటిఆర్ అంటూ దొంగలను దొంగలనకపోతే ఏమంటారని ప్రశ్నించారు. తెలంగాణలో గోదావరి నదిపై తలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మాట వచ్చినప్పుడు సీమాంధ్ర నాయకులు అంతర్రాష్ట్ర వివాదం ఉందంటారని, పోలవరం ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర వివాదంలో చిక్కుకుందనే విషయాన్ని పట్టించుకోబోరని ఆయన అన్నారు. అనుమతులు లేకపోయినా నాలుగు వేల కోట్ల రూపాయలు పోలవరం నీటిలో ముంచారని ఆయన అన్నారు.

పులిచింతల ప్రాజెక్టును పోలీసులను పెట్టి నిర్మించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అది జరిగిందని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి మొత్తం కృష్ణానదినే తరలించుకుపోవాడనికే వైయస్ పూనుకున్నారని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడుతో పాటు పలు ప్రాజెక్టులకు కేటాయింపులకు మించి నీటిని తరలిస్తున్నారని ఆయన అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉందని, సీమాంధ్రలోని ప్రాజెక్టులు మాత్రం వెంటనే పూర్తవుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+