ఊసరవెల్లిని కాను, సమైక్యంతో లింక్ లేదు: ఉండవల్లి

విభజన సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన తెలంగాణ నేతలకు సూచించారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఆంధ్ర నేతలను ఒప్పించి తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. విడిపోవాలనుకుంటే చర్చల ద్వారా ఒప్పించి విడిపోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, గత పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని ఆయన అన్నారు. తాను తెలంగాణ ఉద్యమాన్ని కించపరచలేదని, తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నం కూడా చేయలేదని ఉండవల్లి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఘన చరిత్ర ఉందని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు తీర్మానం చాలు అన్నప్పుడు శానససభ ప్రస్తావన ఎందుకని ఆయన అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3పై సుప్రీంకోర్టు తీర్పును కూడా తెలంగాణ నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తాను ఎవరినీ కించపరచలేదని, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకించానని ఆయన అన్నారు.
తాను మాట్లాడినవన్నీ అక్షర సత్యాలని, తాను ఎక్కడా అబద్ధం మాట్లాడలేదని ఆయన అన్నారు. తాను అబద్ధం మాట్లాడినట్లు నిరూపిస్తే సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలు ఉండకూడదనేది తన అభిప్రాయమని చెప్పారు. చర్చల ద్వారా విభజన సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల్లో ఐక్యత వస్తుందనుకుంటే సంతోషిస్తానని అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన సభకు హాజరు కావడంలో తప్పు లేదని ఉండవల్లి అన్నారు. అప్పటి అసెంబ్లీలో 102 మంది సభ్యులు మాట్లాడారని మాత్రమే చెప్పానని, తీర్మానం చేశారని చెప్పలేదని వివరణ ఇచ్చారు.
కొత్త రాష్ట్రాలు ఏర్పడడంలో తప్పు లేదని, తాము రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించే సత్తా కాంగ్రెసుకు ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై తాను మాట్లాడిన విషయాలను వక్రీకరించారని అన్నారు. గిరిజనులను చంపాలని తాను అనలేదని, గిరిజనులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తరలిద్దామని చెప్పానని స్పష్టం చేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశని, చైనాలో జరిగే అకృత్యాలు ఇక్కడ జరగవని అన్నారు.
ఏ సమావేశానికి పిలిచినా వెళ్తానని ఆయన చెప్పారు. ఎవరికీ తనపై వ్యక్తిగత శత్రుత్వం లేదని, రాజకీయ వైరుధ్యాల కారణంగానే తనను వ్యతిరేకిస్తున్నారని ఉండవల్లి చెప్పారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను గ్రంథాలయం నుంచి తాను సేకరించానని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైందని, దాన్ని కూడా తమ కాంగ్రెసు పార్టీయే ప్రారంభించిందని, అవతల మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకివ్వరనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెసు ప్రారంభించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications